క‌ర్ణాట‌క నాడి ప‌ట్టుకోలేక‌పోయిన స‌ర్వేలు

ఎన్నిక‌లు.. ఓట్లు.. అన‌గానే ముంద‌స్తు స‌ర్వేలు.. అంటూ.. కొన్ని మీడియా సంస్థ‌లు స‌ర్వేలు వండి వారుస్తా యి. అదేవిధంగా ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు కూడా ఇస్తాయి. అయితే.. ఎప్పుడు ఎలా ఉన్నా.. ఈ సారి మాత్రం సర్వే సంస్థ‌లు క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోలేక పోయాయి. హంగ్ వ‌స్తుంద‌ని.. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాద‌ని.. అనేక సంస్థ‌లు వెల్ల‌డించాయి. ఒక‌టి రెండు సంస్థ‌లు కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని అంచ‌నా వేసినా.. అది కూడా కాద‌ని.. తేల్చి చెప్పాయి.

కానీ, తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ దూసుకెళ్తోంది. అధికార బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీఎస్ చెప్పుకోదగ్గ స్థానాలతో సరిపెట్టుకునే అవకాశం కనిపిస్తోంది.

కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో అధిష్ఠానం అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలందరినీ వెంటనే బెంగళూరుకు రావాలని కోరింది. కాంగ్రెస్ ముందంజలో ఉండడం వల్ల ఆ పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు బెంగళూరులో కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ శిమ్లాలోని హనుమాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెర‌సి మొత్తంగా స‌ర్వే సంస్థ‌లు క‌న్న‌డ నాడిని ప‌ట్టుకోవ‌డంలో త‌డ‌బ‌డ్డాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.