కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. బీజేపీ గత 2018 లో తెచ్చుకున్న 104 స్థానాలకంటే కూడా.. ఇప్పుడు ఘోరస్థానానికి పడిపోయింది. అప్పట్లో 104 స్థానాల్లో విజయం దక్కించుకున్న కమల నాథులు.. ఇప్పుడు కేవలం 78 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల సమయానికి కేవలం 22 స్థానాల్లోనే బీజేపీ అభ్యర్థులు విజయం దక్కించుకున్నారు.
దీంతో బీజేపీకి దక్షిణాదిలో తీవ్ర శరాఘాతం తగిలిందని పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాదు.. విభజిత రాజకీయాలను చేయడంలో ఆరితేరిన కమలనాథులకు ఈ ఎన్నికలు గట్టి చెంప పెట్టుగా మారాయని చెబుతున్నారు. బీజేపీకి కీలక స్థానాల్లో ఎదురు దెబ్బతగలడం గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున బరిలో నిలిచిన అత్యంత కీలకమైన నాయకులు కొందరు ఆధిక్యంలో కొనసాగుతుండగా మరికొందరు వెనుకబడ్డారు.
బళ్లారి నియోజకవర్గంలో శ్రీరాములు 63 వేల 446 ఓట్లతో వెనుకబడ్డారు. సొరబ స్థానంలో కుమార బంగారప్ప తన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు బంగారప్పపై వెనుకంజలో కొనసాగుతున్నారు. కుమార బంగారప్పకు 50 వేల 175 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. చిక్కమగళూరు స్థానంలో సి.టి. రవి 33 వేల 783 ఓట్లతో వెనుకబడ్డారు. షిగ్గావ్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బసవరాజ్ బొమ్మై 76 వేల 499 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. శికారిపుర స్థానంలో పూర్వ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు బీఎస్ విజయేంద్ర 53 వేల 278 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మొత్తంగా ఈ పరిణామాలను అంచనా వేస్తే.. బీజేపీకి దక్షిణాదిలో పెద్దగా ఆదరణ లేదని మరోసారి రుజువైంది. అంతేకాదు.. కర్ణాటక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీ.. సహా అమిత్‌షాలకు సైతం మొహం ఎత్తుకోలేని పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో విజయంతో తెలంగాణలోనూ దూకుడు ప్రదర్శించాలని.. అక్కడ కూడా అధికారంలోకి రావాలని కలలు గన్న బీజేపీకి ప్రజలు చాచి కొట్టినట్టు వ్యవహరించారని పరిశీలకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates