తూర్పుగోదావరి జిల్లాల్లోని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయం బాగా వేడి పెంచేస్తోంది. టీడీపీ నేత వరుపుల రాజా హఠాత్తుగా చనిపోవటంతో నియోజకవర్గం ఇన్చార్జిగా ఆయన భార్య సత్యప్రభను చంద్రబాబునాయుడు నియమించారు. మరీ నియామకం తాత్కాలికమా లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఈమెకే టికెట్ ఇచ్చే ఉద్దేశ్యం ఉందా అన్నది తెలీదు. ఇదే సమయంలో వైసీపీ సిట్టింగ్ ఎంఎల్ఏ పర్వత పూర్ణచంద్రప్రసాద్ యాక్టివ్ గానే ఉన్నా నియోజకవర్గంలో బాగా వ్యతిరేకత కూడా ఉంది.
పార్టీలో ప్రసాద్ వ్యతిరేక గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఎంఎల్ఏ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతర్గత సమస్యలను పరిష్కరించి నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు రీజనల్ కో ఆర్డినేటర్ హోదాలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. దాంతో ఇక్కడ కొత్త అభ్యర్ధిని పోటీలోకి దింపటం ఒకటే మార్గమని మిథున్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెప్పారట. అందుకని కొత్త అభ్యర్ధి కోసం వెతుకటం మొదలైంది. ఇందులో భాగంగానే టీడీపీ ఇన్చార్జి సత్యప్రభకు వైసీపీ గాలమేస్తోందనే ప్రచారం పెరిగిపోతోంది.
ఎందుకంటే వరుపుల రాజా ఒకపుడు వైసీపీలోనే ఉండేవారు. అయితే టికెట్ దగ్గర తేడా రావటంతో పార్టీ మారిపోయారు. 2019లో రాజాకు వైసీపీ టికెట్ ఇవ్వకపోవటంతో పార్టీ మారి టీడీపీ అభ్యర్ధిగా పోటీచేశారు. ప్రసాద్ మీద పోటీచేసి ఓడిపోయినా 71 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అంటే పార్టీ ఓట్లతో పాటు వ్యక్తిగతంగా కూడా రాజాకు నియోజకవర్గంలో పట్టుందన్న విషయం అర్ధమైంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమనే అందరు అనుకుంటున్నారు.
అయితే ఆయన హఠాన్మరణంతో అధినేతల లెక్కలన్నీ మారిపోయాయి. చివరకు ఆయన భార్య సత్యప్రభ లైనులోకి వచ్చారు. రాజా మరణం తాలూకు సింపథీ ఉంటే సత్యప్రభను ఓడించటం కష్టమని వైసీపీ అనుకుంటున్నట్లు సమాచారం. అందుకనే సత్యప్రభను పార్టీలోకి తెచ్చుకుని టికెట్ ఇవ్వటమో లేకపోతే ఏదైనా నామినేటెడ్ పోస్టిచ్చి వేరే అభ్యర్ధి గెలుపుకు ఆమెను పనిచేసేట్లుగా ఒప్పించాలని అనుకుంటున్నారట. అందుకనే రాజా కుటుంబంతో బాగా సన్నిహిత సంబంధాలున్న వైసీపీ నేతలు సత్యప్రభతో మాట్లాడే బాధ్యతలను అప్పగించారనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates