మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికల ముంగిట తన రాజకీయ వైఖరిని స్పష్టం చేసేశాడు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కచ్చితంగా ఉంటుందని సంకేతాలు ఇస్తూ.. తాను సీఎం పదవికి పోటీలో లేనని స్పష్టత ఇచ్చాడు. చాలా స్పష్టతతో, నిజాయితీగా పవన్ చేసిన ప్రకటన రాజకీయంగా పెద్ద చర్చకే దారి తీసింది. పవన్ చేసిన ప్రకటన పట్ల తెలుగుదేశం మద్దతు దారులు సానుకూలంగా స్పందించారు. వైసీపీ వాళ్లు యథా ప్రకారం ఎటాక్ చేస్తున్నారు.
ఇక జనసేన కార్యకర్తల విషయానికి వస్తే వారి నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వాళ్లు ఈ స్టేట్మెంట్ విషయంలో ఎలా స్పందించాలో తెలియని అయోమయంలో కనిపిస్తున్నారు. ఒక వర్గం.. పవన్ వాస్తవానికి దగ్గరగా మాట్లాడాడని.. అందరూ రియాలిటీని అర్థం చేసుకుని.. జగన్‌ను దించడమే ప్రథమ లక్ష్యంగా పని చేయాలన్న పవన్ ఆలోచనకు అనుగుణంగా పని చేయాలని అంటున్నారు.
కానీ జనసేనలో ఇంకో వర్గం మాత్రం పవన్ ప్రకటన పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఇలా ముందే రేసు నుంచి ఎందుకు తప్పుకోవాలి.. మన బలాన్ని ఎందుకు తక్కువ చేసి చూపించాలి అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో ఇంత నిజాయితీ, ఓపెన్ టాక్ పనికి రాదని వాళ్లంటున్నారు.
వాస్తవ బలం ఎంత ఉన్నప్పటికీ పైకి మాత్రం గాంభీర్యాన్ని ప్రకటించాలని.. పైకి పట్టుదలగా కనిపిస్తేనే.. పొత్తులప్పుడు ఎక్కువ ప్రయోజనం దక్కుతుందని.. రేప్పొద్దున కాలం కలిసొచ్చి కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం వస్తే సీఎం పదవిని కూడా డిమాండ్ చేయొచ్చని వారంటున్నారు. పవన్ సీఎం పదవి వద్దని చెప్పాల్సి వచ్చినా.. ఇంత ఓపెన్‌గా ఆ ప్రకటన చేయాల్సింది కాదని.. సమయం వచ్చినపుడు చూద్దాం అని విషయాన్ని దాటవేస్తే బాగుండేదని ఆ వర్గం అంటోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates