జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన పార్టీని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎంతో పోల్చుకున్నారు. జనసేన కూడా ఎంఐఎం వంటిదేనని చెప్పారు. ” ఎంఐఎం పార్టీ 7 స్థానాలకే పరిమితమైనా దాని ప్రాధాన్యత అలాగే ఉంది. మన బలం ఏమిటో మనం బేరీజు వేసుకోవాలి. క్రేన్లతో గజమాలలు వేయడం కాదు.. ఓట్లు వేయండి. పొత్తులను తక్కువగా అంచనా వేయవద్దు” అని కార్యకర్తలకు హితవు పలికారు.
వచ్చే ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో అయినా గెలిచేలా పార్టీని ముందుకు నడిపించాలని కార్యకర్తలకు సూచించారు. జనాదరణ ఉన్నా 10 స్థానాలు కూడా రాకుంటే ఏం చేయలేం. కష్టాల్లో పవన్ గుర్తుకొస్తాడు.. ఎన్నికలప్పుడు మర్చిపోతారని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏపీలో ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. “జనసేనలో నేనూ ఒక కార్యకర్తను. నేను మార్పును కోరుకునేవాడిని. డబ్బు లేకుండా రాజకీయాలు చేయవచ్చని చూపించాం. ఓట్లు కొనకుండా రాజకీయం చేయాలి” అని అన్నారు.
జనసేన ఉన్నది టీడీపీ నేతను సీఎం చేయడానికి కాదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేసమయంలో వైసీపీ సర్కారుపైనా ఆయన మరోసారి విరుచుకుపడ్డారు. తాను నటించిన బీమ్లానాయక్ సినిమాను అడ్డుకున్నారని సినిమాను అడ్డుకోవడంతో రూ.30 కోట్లు నష్టం వచ్చిందని పవన్ తెలిపారు. దమ్ము లేనివారు రాజకీయాల్లో ఉండకూడదన్నారు. 40 ఏళ్లు పార్టీ నడిపిన, సీఎంగా చేసిన వ్యక్తి గురించే నీచంగా మాట్లాడారని వైసీపీ నేతలపై పవన్ విమర్శలు గుప్పించారు.
త్రిముఖ పోటీలో బలి కావడానికి జనసేన సిద్ధంగా లేదన్నారు. జూన్ నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధంగా ఉన్నామని పవన్ ప్రకటించారు. ఈ పర్యటన అన్ని జిల్లాలలోనూ జరుగుతుందని చెప్పారు. ముందు సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేసుకునేందుకు ప్రాధాన్యంఇస్తామని.. తర్వాత పొత్తులు ఉంటాయని చెప్పారు. దీనిపై నిర్ణయాన్ని తనకే వదిలేయాలని పవన్ సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates