జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఇక్కడ అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులను ఆయన కలుసుకున్నారు. వారితో ముచ్చటించారు. వారి బాధలు తెలుసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న సినిమా షూటింగులో బిజీగా ఉన్న పవన్.. ఆ షూటింగును సైతం పక్కన పెట్టి.. ఏపీలో పర్యటించారు. అది కూడా అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను పరామర్శించారు.
పవన్.. కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చి న ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలను పవన్ అడిగి తెలుసుకు న్నా రు. ఇక, పవన్ కోసం.. మీడియా పడిగాపులు పడింది. ఆయన వచ్చిన మొదలు.. వెళ్లే వరకు కూడా గంటల కొద్దీ మీడియా ఆయనకోసం వేచి చూసింది. అయితే.. అనూహ్యంగా పవన్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోవడం ఆశ్చర్యంగా మారింది.
నిజానికి ఎక్కడ కార్యక్రమం జరిగినా.. పవన్ ఏపీ సర్కారు పై నిప్పులు చెరుగుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను కూడా ఆయన ఎండగడుతున్నారు. అలాంటిది ఇప్పుడు రైతులను పరామర్శించేందుకు వచ్చి.. వారి కష్టాలు కూడా తెలుసుకుని మరీ.. ఆయన పత్తాలేకుండా వెళ్లిపోయారు. కనీసం.. పన్నెత్తు మాట కూడా సర్కారుపై ఆయన అనలేదు. దీంతో అందరూ విస్మయం వ్యక్తం చేశారు.
దీనికి కారణాలు ఏంటి? అనే విషయంపై చర్చోపచర్చలు తెర మీదికి వచ్చాయి. ఎప్పుడు మీడియా ముందు కు వచ్చినా..రాకున్నా..చిన్న కారణం దొరికితే.. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగే పవన్.. ఇప్పుడు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారేది ప్రశ్న. ఇటీవల చంద్రబాబుకూడా ఇక్కడ పర్యటించారు. ఆయన ఏకంగా.. సర్కారుకు 72 గంటల అల్టిమేటం ఇచ్చారు. అప్పటిలోగా రైతులకు న్యాయం చేయాలని చెప్పారు. కానీ, పవన్ మాత్రం ఒక్క కామెంట్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates