వైఎస్ అనుచరులను జగన్ దూరం పెట్టాడంటారు. అందుకే కేవీపీ రామచందర్ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లు వైసీపీలో కనిపించరంటారు. ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారుతున్నట్లు కనిపిస్తోంది. వైఎస్ కు అత్యంత సన్నిహితులను కూడా జగన్ చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. పార్టీ పరిస్తితి బాగోకపోవడంతో నియోజకవర్గాల్లో విజయావకాశాలను పెంచే వారిని జగన్ రెడ్డి అక్కున చేర్చుకుంటున్నారు..
వైవీ రెడ్డి ఎంట్రీ…
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి యెర్రం వెంకటేశ్వర రెడ్డి (వైవీ రెడ్డి) రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009లో ఆయన ఎమ్మెల్యేగా సేవలందించారు. రాజకీయాల్లో పెద్ద కాకపోయినా, నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేకపోయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఎమ్మెల్యే టికెట్ పొందుతూ వచ్చారు. ఎమ్మెల్యేగా కూడా ఆయన లో ప్రొఫెల్ లోనే ఉండేవారు. ఎవరితో పెద్దగా కలిసేవారు కాదు. అందుకే రాష్ట్ర విభజన తర్వాత వెంకటేశ్వర రెడ్డి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేశారు. దాని వెనుక ఒక పెద్ద రహస్యముందని చెబుతారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు… ఆయన్ను జనసేనలో చేర్పించారని అనేవారు. ఎన్నికల్లో పోటీకి కొంత ఫండింగ్ కూడా చేశారని చెబుతారు. ఆ ఎన్నికల్లో వెంకటేశ్వర రెడ్డికి పట్టుమని పది వేల ఓట్లు కూడా రాలేదు. కోడెల కూడా ఓడిపోయారు. వైసీపీ తరపున విజయం సాధించిన అంబటి రాంబాబు ఇప్పుడు నీటి పారుదల శాఖామంత్రిగా ఉన్నారు…
వైసీపీలో చేరిక..
యెర్రం వెంకటేశ్వరరెడ్డి అకస్మాత్తుగా మళ్లీ రాజకీయ తెరమీదకు వచ్చారు. తన కుమారుడు నితిన్ రెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అంబటి రాంబాబు, నరసరావుపేట లోక్‌సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు ఆయన వెంట ఉన్నారు.
కన్నాకు చెక్ పెట్టేందుకేనా..
తెలుగుదేశంలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో అంబటికి విశ్రాంతి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. దానితో కాపు రెడ్డి కాంబినేషన్ గా ఉండేందుకు వెంకటేశ్వరరెడ్డిని రంగంలోకి తెచ్చారని చెబుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి లేదా ఆయన కుమారుడు నితిన్ రెడ్డినిపోటీ చేయించిన పక్షంలో మీరు కూడా పూర్తిగా సహకరించాలని అంబటిని అందరి ముందు జగన్ ఆదేశించారట. అప్పుడు రెడ్డి ఓట్లు, కాపు ఓట్లు కలిసి వైసీపీకే వస్తాయని విశ్వసిస్తున్నారట. అప్పుడు కన్నాను ఓడించే వీలుంటుందని లెక్కలేసుకుంటున్నారట. చూడాలి మరి..