ఆయన వస్తే జనం.. రాకపోతే ఏం చేస్తాం మనం?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెనుక జనం గోదావరిలా పరుగులు తీస్తున్నారు. ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న దగ్గర నుంచి కారులో కడియం ఆవ ప్రాంత రైతుల దగ్గరకు వెళ్లే వరకు ఆయన వెంట ఒకటే జనం.

కడియం ఆవ, కొత్తపేట ప్రాంతాలలో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చిన పవన్ పర్యటనలో ఇసుకేస్తే రాలనంత జనం. ప్రజలు ఇంతగా కోరుకుంటున్నా పవన్ ఎందుకు నిత్యం రాజకీయాలలో ఉండడం లేదు? షూటింగ్ విరామాలలోనే రాష్ట్రంలో పర్యటిస్తున్నారెందుకు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఏపీలో ఇప్పుడున్న ప్రభుత్వంపై జనం విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నారని జనం నాడి తెలిసినవారు పదేపదే చేప్తున్నా పవన్ ఎందుకు ప్రజలకు దూరంగా ఉంటున్నారు. రెణ్నెళ్లకో, మూణ్నెళ్లకో ఓసారి కనిపించి వెళ్లిపోతున్నారెందుకు? తాను జనంలోకి వచ్చినప్పుడు స్వయంగా ఆ రెస్పాన్స్ చూస్తు్న్నా ఆయన ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు?

ఇవే ప్రశ్నలు ఇప్పుడు జనసేన క్యాడర్ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. తమ నాయకుడు రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవాలని.. లేదంటే మళ్లీ నష్టపోతామని అంటున్నారు. ఆయన్ను నమ్ముతునం, జనం క్యాడర్ కోసమైనా రాజకీయాలకు పూర్తి ప్రయారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.

పవన్ రాష్ట్రంలో లేనప్పుడంతా నాదెండ్ల మనోహరో.. నాగబాబో కథ నడిపిస్తున్నా పవన్ ఉంటే కనిపించే ప్రభావం వారు ఉన్నప్పుడు కనిపించడం లేదు. పవన్ ప్రజల్లోకి వచ్చినప్పుడు, రాజకీయాలు మాట్లాడినప్పుడు ఆ రెస్పాన్స్ వేరేగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో కొన్నాళ్లు ఏపీలో ఉండి శ్రేణులను ఉత్తేజపరచాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండడంతో పొత్తులు, సీట్ల లెక్కలతో సంబంధం లేకుండా నియోజకవర్గాలలో నాయకులను ఎన్నికలకు రెడీ చేయాల్సి ఉంది.

కానీ, ఎందుకో పవన్ ఆ దిశగా సక్సెస్ ఫుల్‌గా వ్యూహాలు రచించలేకపోతున్నారు, అమలు చేయలేకపోతున్నారు. ఓ వైపు లోకేశ్ పాదయాత్రతో నిత్యం జనంలో ఉంటుండడం.. చంద్రబాబు కూడా తరచూ ర్యాలీలు నిర్వహిస్తుండడంతో పాటు ముఖ్యమంత్రి జగన్ కూడా వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేలా సిద్ధమవుతుండడంతో పవన్ ఒక్కడిదే ఆలస్యం అన్నట్లుగా ఉంది. ఇదంతా చూస్తున్న జనసేన క్యాడర్ ‘ఆయన వస్తే జనం.. రాకపోతే ఏం చేస్తాం మనం’ అంటూ నిట్టూరుస్తున్నారు.