హామీలు పోయి.. హ‌నుమానే నిలిచాడు!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌లు.. ఆది నుంచి కూడా బాగానే క‌స‌ర‌త్తు చేశాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు సెగ త‌గ‌ల‌కుండా.. ఎదురుదాడి చేయ‌డంలో బీజేపీ, ప్ర‌భుత్వ అవినీతిని.. తేట‌తెల్లం చేయ‌డంలో కాంగ్రెస్‌లు శ‌క్తికి మించి కృషి చేశాయి. ఒక‌రిపై ఒక‌రు వేసుకోని నింద‌లే దు. ఒక‌రిని మించి.. అన్న‌ట్టుగా ఒక‌రు.. మేనిఫెస్టోల‌ను తీర్చిదిద్దుకున్న‌దీ తెలిసిందే. ఉచితాల‌కు తాము వ్య‌తిరేక‌మ‌న్న బీజేపీ.. ఉచితాలు ఇస్తే.. త‌ప్పేలేద‌న్న కాంగ్రెస్‌లు.. రెండూ కూడా ఉచిత స్మ‌ర‌ణ‌లు చేశాయి.

రిజ‌ర్వేష‌న్ నుంచి రాష్ట్ర స‌మ‌స్య‌ల వ‌ర‌కు.. మేనిఫెస్టోల్లో పెట్టాయి. పాల నుంచిబియ్యం వ‌ర‌కు ఉచిత హామీలు గుప్పించాయి. ఈ రెండు పార్టీల్లో ఏదీ త‌క్కువ‌కాదు.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాయి. తాము అధి కారంలోకివ‌స్తే.. మ‌ళ్లీ ముస్లిం రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డంతోపాటు పెంచుతామ‌ని కాంగ్రెస్ చెప్పింది. అదేవిధంగా స‌మాజానికి ఇబ్బందిగా మారిన కొన్ని సంస్థ‌ల‌ను నిషేధిస్తామ‌ని కూడా హామీ ఇచ్చింది. దీనిలో విశ్వ‌హిందూ ప‌రిష‌త్ విభాగ‌మైన‌.. భ‌జ‌రంగ్‌ద‌ళ్ కూడా ఉంది.

అంతే!! అప్ప‌టి వ‌ర‌కు.. ఒక‌ర‌కంగా.. సాగిన ప్ర‌చారం మొత్తం బీజేపీ యూట‌ర్న్ తిప్పేసింది. నిజానికి కాం గ్రెస్ మేనిఫెస్టో విడుద‌ల చేసే వ‌ర‌కు.. బీజేపీకి త‌నది అంటూ చెప్పుకొనేందుకు క‌నిపించ‌లేదు. ముఖ్యంగా మ‌తానికి సంబంధించి ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేశామ‌నే ఆందోళ‌న కూడా క‌నిపించింది. ఇంత‌లో కాంగ్రెస్ భ‌జ‌రంగ‌ద‌ళ్ నిషేధ హామీ ఇవ్వ‌డంతో వెంట‌నే బీజేపీ ఫోక‌స్ మొత్తాన్నీ.. చివ‌రి వారం రోజులు దానిపైనే పెట్టేసింది. దీనికి వీహెచ్‌పీ క‌లిసి వ‌చ్చింది. అంతే.. రాష్ట్రం మొత్తం.. జై భ‌జ‌రంగ బ‌లీ! నినాదాల‌తో అట్టుడికి పోయింది.

హామీల స్థానంలో అక‌స్మాత్తుగా హ‌నుమాన్ ప్ర‌వేశించాడు. బీజేపీ నేత‌లు హ‌నుమాన్‌ను ఓన్ చేసుకున్నారు. అయోధ్య రామమందిరాన్ని ప్ర‌స్తావించారు. అంతేకాదు.. కాంగ్రెస్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. హ‌నుమాన్ అంటే.. కాంగ్రెస్‌కు ప‌డ‌డ‌ని, ఆయ‌న బ‌ర్త్ స‌ర్టిఫికెట్ అడుగుతున్నార‌ని.. అస‌లు హ‌నుమంతుడి మూతి అలా ఎందుకు ఉంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ని..కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌ధాని మోడీ వేసిన కామెంట్లు జ‌నంలో కి విస్తృతంగా వెళ్లిపోయాయి.

ఇక‌, ఎన్నిక‌ల‌కు ఒక‌రోజు ముందు.. అంటే.. మంగ‌ళ‌వారం మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించారు. దేశ‌వ్యాప్తంగా హ‌నుమాన్ చాలీసా ప‌ఠించాల‌న్న వీహెచ్‌పీ పిలుపుతో.. చాలీసా ప‌ఠ‌నాలుసాగాయి. ఇక‌. ఈ దుమారంలో అప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన హామీలు కానీ.. ఉచితాలు కానీ..అన్నీ కొట్టుకుపోయి.. వాటి స్థానంలో హ‌నుమాన్ వ‌చ్చి కూర్చోవ‌డం జ‌రిగిపోయింది. మ‌రి ఓట‌ర్లు ఏం చేస్తారో చూడాలి.