ఏపీ రాజధాని అమరావతిపై తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి అదే పంథాలో విమర్శలు గుప్పించారు. అమరావతిని ఎవరూ ముట్టుకోకూడదా? రైతులకే రాసిచ్చారా? అంటూ.. ఆయన మండి పడ్డారు. అమరావతి రాజధాని అంటే అదేమైనా బ్రహ్మపదార్ధమా? అని ప్రశ్నించారు. అమరావతిలో ఉన్న 30 వేల ఎకరాల భూములు భవనాల కోసమేనా?.. అమరావతిలో పేదవారికి ఇంటి స్ధలాలు కేటాయించటం తప్పా? అని అన్నారు.
అమరావతి భూములు ప్రైవేటు వ్యక్తులవి కావని, ఆ భూములు ప్రభుత్వానివని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవటం లేదని, కోర్టు తీర్పుకు అనుగుణంగానే అమరావతి భూముల్లో హద్దు రాళ్లు వేస్తు, పేదలకు పంపిణీ చేస్తున్నామని, అమరావతి అంటే ప్రైవేటు వెంచరు కాదని మంత్రి బొత్స సత్యానారాయణ వ్యాఖ్యానించారు.
అమరావతిలో ఆర్-5 జోన్ అంశంపై మంత్రి బొత్స ఈ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆర్-5 జోన్‌లో సామాన్యులు, మధ్యతరగతి వారికి ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటే.. కాదనడం సరికాదన్నారు. రాజధాని నివాసిత ప్రాంతం కాదా? 30 వేల ఎకరాల్లోనూ భవనాలు కట్టాలని ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. ప్రజా వినతుల పరిష్కారానికి సీఎం జగన్ ప్రారంభించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని.. విజయనగరంలో అధికారులతో కలిసి మంత్రి బొత్స వీసీలో వీక్షించారు. ఈ సందర్భంగా ఆయనఅమరావతిపై వ్యాఖ్యలు చేశారు.
రాళ్లు పీకేసిన రైతులు
ఆమరావతి రాజధాని పరిధిలోని కురగల్లులో ప్రభుత్వం జగనన్న ఇళ్ల పథకం కింద పేదలకు కేటాయించిన ప్లాట్లు కు సంబంధించి హద్దురాళ్ళను రైతులు పీకేశారు. తమకు రావాల్సిన రాజధానిలో ప్లాట్ కేటాయింపు, గత కొద్ది సంవత్సరాలుగా రాజధాని రైతులకు కవులు ఇవ్వకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా అన్యాయంగా మా ఫ్లాట్లలో ఇళ్ల స్థలాలకు సంబంధించి హద్దురాళ్ళు పాతడం అన్యాయం అన్నారు. కవులు, ఫ్లాట్ల కేటాయింపులు ఇచ్చిన తర్వాతే హద్దురాళ్ళు వేసుకోవాలని కురగల్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates