ఇప్పుడు మోడీని ఏమ‌ని విమ‌ర్శిస్తారు కేసీఆర్ స‌ర్‌!!

కొన్నాళ్ల కింద‌ట‌.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక సంద‌ర్భంలో మాట్లాడుతూ.. న్యాయ‌మూర్తులుగా ప‌నిచేసిన వారిని తీసుకువ‌చ్చి గ‌వ‌ర్న‌ర్‌ల‌ను చేస్తున్నారు. ఎన్నిక‌ల సంఘం అధికారుల‌ను చేస్తున్నారు. కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నారు. దీనినేమంట‌రు? ఏమైనా అంటే.. మోడీపై చించుకుంటున్నామ‌ని అంట‌రు. కానీ, చేసేదేంది? త‌ప్పుడు ప‌నులు కాదే! మీరు చేసే ప‌నులు ఏం సంకేతాలు ఇస్తున్న‌ట్టు ఈ దేశానికి! అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై విరుచుకుప‌డ్డారు. కీల‌క ప‌ద‌వుల్లో ప‌నిచే సిన వారికి త‌ర్వాత‌.. అంతే ప‌దువులు ఇవ్వ‌డం రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఏపీ గ‌వ‌ర్న‌ర్ న‌జీర్‌.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ఇలా రిటైర్ కాగానే అలా గ‌వ‌ర్న‌ర్‌పోస్టు ఇవ్వ‌డంపై విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. అదే విదంగా ప్ర‌స్తుత ఎన్నికల క‌మిష‌న‌ర్‌ను కూడా రాత్రికి రాత్రి త‌న ఐఏఎస్ ప‌ద‌వికి రాజీనామా చేయించి.. ఈ ప‌ద‌వి అప్ప‌గించార‌ని.. అది కూడా గుజ‌రాత్ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగింద‌నే విమ‌ర్శ‌లు కూడా మోడీపై వ‌చ్చాయి. వీటినే చాలా సంద‌ర్భాల్లో కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు, మంత్రి కేటీఆర్ కూడా ఎత్తి చూపారు. సో.. వీరు చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి. మోడీ చేసింది క‌రెక్టేనా అనే చ‌ర్చ కూడా వ‌చ్చింది.

అయితే.. ఇప్పుడు కేసీఆర్ చేసింది ఏంటి? అనేది నెటిజ‌న్లు, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు సంధిస్తున్న ప్ర‌శ్న‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రాజీవ్ శర్మను కేసీఆర్‌ తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవిలో నియ‌మించుకున్నారు. త‌ర్వాత‌ కేసీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా మాజీ అధికారి నర్సింగరావును నియ‌మించుకున్నారు. ఇక‌, ఇప్పుడు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌ను తన ప్రధాన సలహాదారుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించుకున్నారు.

మ‌రి అవి కూడా కీల‌క ప‌దవులే క‌దా! మ‌రి అలాంటిప్పుడు ఇలా.. మ‌ళ్లీ స‌ల‌హాదారులుగా నియ‌మించుకునే అవ‌కాశం ఎందుకు వ‌చ్చింది? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇక‌, ఏది ఎలా ఉన్నా.. కూడా మోడీని విమ‌ర్శించే ప‌రిస్థితిని రాను రాను కేసీఆర్ కోల్పోతున్నార‌నేది నెటిజ‌న్ల మాట‌. మ‌రి దీనిపై బీఆర్ ఎస్ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.