కర్ణాటకలో కాంగ్రెస్ కు స్వల్ప మెజార్టీ

దక్షిణాది రాష్ట్రం కర్టాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఖాయమని , అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆ సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ 105-117 స్థానాలు, బీజేపీ 81-93 స్థానాలు, జేడీ(ఎస్‌) 24-29, ఇతరులు 1-3 స్థానాలు పొందే అవకాశాలున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఈ సారి మూడు శాతం వరకు పెరుగుతుందని పీపుల్స్ పల్స్ అంటోంది. 2018లో 38.14 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ 41.4 శాతం పొందే అవకాశాలున్నాయి. 2018లో 36.35 ఓట్ల శాతం పొందిన అధికార బీజేపీ ఇప్పుడు స్వల్పంగా 0.3 శాతం కోల్పోయి 36 శాతం ఓట్లు సాధించవచ్చు.

2018లో కింగ్‌మేకర్‌ పాత్ర పోషించిన జేడీ(ఎస్‌) ఇప్పుడు 16 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. ఇది 2018 కంటే 2.3 శాతం తక్కువ. మే మొదటి వారంలో పీపుల్స్ పల్స్ ఈ సర్వే నిర్వహించగా.. చివరకు రెండు రోజుల ప్రచారాన్ని పరగణించలేదని ఆ సంస్థ అంటోంది. తటస్థ ఓటర్లు మనసు మార్చుకుంటే సర్వే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలుండగా, కనీస మెజార్టీకి 113 చోట్ల గెలవాలి.

ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తున్నారని ఓటర్ల అభిప్రాయాన్ని కోరగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పక్షాన 42 శాతం మంది నిలిచారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మైకి 24 శాతం, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి 17 శాతం, మాజీ సీఎం బి.యడియూరప్పకు 14 శాతం మంది, డి.కె.శివకుమార్‌కు 3 శాతం మంది ప్రాధాన్యతిచ్చారు.

కర్ణాటక రాష్ట్రం అభివృద్ధికి ఏ పార్టీ మెరుగైనది అని ప్రశ్నిస్తే కాంగ్రెస్‌కు 46 శాతం, బీజేపీకి 34 శాతం, జేడీ(ఎస్‌)కు 14 శాతం ప్రాధాన్యతిచ్చారు. బీజేపీ ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తారా అని ప్రశ్నించగా 53 శాతం ఇవ్వమని, 41 శాతం ఇస్తామని చెప్పగా 6 శాతం మంది తటస్థంగా ఉండిపోయారు.