కర్ణాటక ఎన్నికల తరువాత కేసీఆరే టార్గెట్

కర్ణాటక ఎన్నికల పనులు ఒకటి రెండు రోజుల్లో ముగుస్తాయి. తెలుగు నేతలకు జాతీయ పార్టీలు అప్పగించిన కర్ణాటక బాధ్యతలు ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతాయి. బీజేపీ ఇక పై తెలంగాణను సీరియస్ గా తీసుకోవాలనుకుంటోంది. అధిష్టానం ఆ దిశగా ప్రత్యేక దృష్టి పెడుతోంది. కార్యకర్తలు నేతలు నిత్యం జనంలో ఉండే కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతోంది..

కమలం పార్టీ తెలంగాణలో మొదలుపెట్టి ఆగిపోయిన నిరుద్యోగ మార్చ్ ను మళ్లీ నిర్వహించబోతోంది. ఈ నెల 11న అంటే కర్ణాటక పోలింగ్ జరిగిన మరుసటి రోజున నిరుద్యోగ మార్చ్ నిర్వహించబోతున్నట్లు టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. నిరుద్యోగులు, ప్రజాస్వామ్యవాదులంతా తరలి వచ్చి మార్చ్ ను జయప్రదం చేయాలని ఆయన కోరుతున్నారు.

నిరుద్యోగ మార్చ్ లో అనేక డిమాండ్లను ప్రస్తావించబోతున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలన్న బీజేపీ ప్రధాన డిమాండ్. స్కాంకు బాధ్యుడైన ఐటీ శాఖామంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలన్నది రెండో డిమాండ్. పరీక్షల రద్దుతో ప్రతీ నిరుద్యోగికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలన్నది మూడో డిమాండ్, బీఆర్ఎస్ ఎన్నిల హామీలో ఒకటైన నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలన్నది నాలుగో డిమాండ్

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉండే కార్యాచరణను బీజేపీ సిద్దంగా ఉంచుుకుంది. తొలుత ఈ నెల 11న సంగారెడ్డితో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తారు. తర్వాత అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మార్చ్ ఉంటుంది. ఆ పని పూర్తయిన తర్వాత హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తారు. అంటే పది లక్షల మంది ఈ మార్చ్ లో పాల్గొంటారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ పలికిన బీఆర్ఎస్ ఇంతవరకు చేసిందేమీ లేదు. తాము అధికారానికి వచ్చిన తక్షణమే రెండు లక్షల ఉద్యోగాల ప్రక్రియ మొదలవుతుందని బీజేపీ ప్రకటించింది…