వచ్చే ఎన్నికల్లో పవన్ ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది. ఆయన ఇష్టమేనని, ఆయనకు ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదని నాగబాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఎవరూ తమకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని `ఓవర్గం మీడియా`ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. “కొన్ని మీడియాలు మాకు సలహాలు ఇస్తున్నాయి. వారి వారి పార్టీలకు సలహాలు ఇస్తే మంచిది“ అని నాగబాబు వ్యాఖ్యానించారు.
‘రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి పోవాలి.. అప్పుడే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుంది’ అని నాగబాబు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం హరిపురంలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తూ.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. “మాకు సలహాలు ఇచ్చేవారు ఎక్కువయ్యారు. అంత అవసరం మాకు లేదు. పార్టీ పెట్టినప్పుడు ఎవరి సలహాలు తీసుకున్నాం. “ అని నిష్టూరంగా మాట్టాడారు.
‘2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ పొత్తులపై చర్చలు వద్దు. జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తే వారిని గెలిపించడమే ధ్యేయంగా పనిచేయాలి. ప్రజల్లో చైతన్యం మొదలైంది. గత ఎన్నికల్లో 7 శాతం ఓట్లు రాగా… ఇప్పుడు ఓటింగ్ శాతం 35కు పెరిగిందని అంచనాలు చెబుతున్నాయి. పార్టీకి మహిళలు ఆక్సిజన్ లాంటివారు. వారికి వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుంది` అని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో వైసీపీ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని నాయకులు రూ. లక్షల కోట్లు స్వాహా చేస్తుంటే.. ప్రజలకు మంచి చేయడాని కి డబ్బులు ఎందుకు ఉండవని జగన్ సర్కారును నాగబాబు ప్రశ్నించారు. పవన్ అధికారంలోకి వస్తే అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇప్పిస్తారని చెప్పారు. ఇదేసమయంలో రైతులకు ఇప్పటి నుంచి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మొత్తంగా నాగబాబు ప్రసంగంలో విమర్శలు.. నిష్టూరాలే కనిపించడంతో పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేశారు.