ఈ నెలాఖరులో జరగబోతున్న టీడీపీ పసుపు పండుగ మహానాడు కీలకంగా మారబోతోందా ? రెగ్యులర్ గా మహానాడును పార్టీ నాయకత్వం చాల అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటుందన్న విషయం తెలిసిందే. కాకపోతే రాబోయే మహానాడు ఆర్భాటంగానే కాకుండా చాలా కీలకంగా కూడా వ్యవహరించబోతోందట. ఎందుకింత కీలకంగా మారబోతోంది ? ఎందుకంటే వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు జరగబోతున్న భారీ కార్యక్రమం కాబట్టే. రాబోయే మహనాడులోనే చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఆ కీలకమైన అంశాలు ఏమిటంటే మొదటిది మేనిఫెస్టో ప్రకటన ఉంటుందంటున్నారు. రెండోది పొత్తుల విషయంపైన నిర్ణయం ప్రకటిస్తారట. మూడోది అభ్యర్ధులను కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం. అలాగే చేరికలు కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయట. అంటే ఈ నాలుగు అంశాలను బహిరంగంగానే ఉంటాయి కాబట్టే రాబోయే మహానాడు చాలా కీలకం కాబోతోంది. మామూలుగా అయితే పొత్తులపై నిర్ణయం, అభ్యర్ధుల ప్రకటనపైన మహానాడు లాంటి కార్యక్రమాల్లో ఎప్పుడు చర్చుండదు.
మ్యానిఫెస్టో, పార్టీలోకి చేరికల్లాంటి విషయాలను చర్చిస్తే చర్చిస్తారంతే. మ్యానిఫెస్టోను కూడా డైరెక్టుగా ఎప్పుడూ మేనిఫెస్టో అని పేరుపెట్టి ప్రకటించింది లేదు. వివిధ అంశాలపై రాజకీయ తీర్మానాల రూపంలోనే ఫైనల్ చేస్తారు. ఆ తర్వాతే పాలిట్ బ్యూరోలో చర్చించి మ్యానిఫెస్టోను నిర్ణయిస్తారు. అలాంటిది రాబోయే మహానాడులోనే పై నాలుగు అంశాలు వేదిక మీద చర్చలు, నిర్ణయాలుంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకనే మహానాడు చాలా కీలకం కాబోతోంది.
పై నాలుగు అంశాల్లో కూడా పొత్తులు, అభ్యర్థుల ప్రకటనే చాలా కీలకమైనవి. జనసేనతో పొత్తు ఉండాలని కొందరు తమ్ముళ్ళు చెబుతుంటే ఎవరితోను పొత్తు అవసరం లేదని మరికొందరు తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారట. పొత్తు రూపంలో వదులుకునే సీట్లన్నీ టీడీపీకి మైనస్ అవుతాయని కొందరు తమ్ముళ్ళు ఇప్పటికే చంద్రబాబుకు గట్టిగా చెప్పారట. అందుకనే పొత్తుల విషయమై పార్టీ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటిస్తారని అంటున్నారు. అలాగే అభ్యర్ధుల ప్రకటన కూడా కీలకమే. చంద్రబాబు, లోకేష్ వివిధ సందర్భాల్లో సుమారు 60 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేశారు. అయితే వీళ్ళందరికీ టికెట్లను మహానాడులో అధికారికంగా ప్రకటించబోతున్నారనేది తాజా సమాచారం. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.