పొంగులేటితో కమలం కొత్త ఆట

తెలంగాణలో డైరెక్ట్ గేమ్ ఆడితే కుదరదని బీజేపీకి అర్థపోయింది. ఇప్పుడు పరోక్షంగా కొట్టాలని డిసైడైంది. పొంగులేటి లాంటి స్వాతంత్ర్యం ప్రకటించుకున్న సామంత రాజులను వాడుకోవాలనుకుంటోంది. పొంగులేటిని బీజేపీలో చేర్చుకుని అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు వ్యూహం పన్నిన్నట్లు చాలా మంది భావించారు. అందుకే ఈటల సహా బీజేపీ నేతలంతా పొంగులేటితో భేటీ అయ్యారని అనుకున్నారు. అసలు గేమ్ ప్లాన్ బయట పడేందుకు మాత్రం 24 గంటలు పట్టింది.

శీనన్న కొత్త పార్టీ..

బీజేపీతోనే ఉండాలి. అలా ఉన్నారని ఎవరికీ అనిపించకూడదు. మత వాద ముద్ర పడిపోతే ఇబ్బందులు ఎదురు కావచ్చు. అందుకే పొంగులేటి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ రైతు సమాఖ్య(టీఆర్ఎస్) పేరుతో పొంగులేటి కొత్త పెట్టబోతున్నారు. ఆయన అనుచరులే ఈ పార్టీని రిజిష్టర్ చేశారు. త్వరలో పొంగులేటి స్వయంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారు.

45 నియోజకవర్గాల్లో పోటీ..

పార్టీతో కొంత అయోమయ స్థితిని కూడా సృష్టించాలని పొంగులేటి వర్గం భావిస్తోంది. అందుకే టీఆర్ఎస్ అని వచ్చేలా పేరు పెట్టింది. పోటీ చేసేందుకు 45 నియోజకవర్గాలను గుర్తించారు. అందులో ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలున్నాయి. మిగతా జిల్లాల్లో బీజేపీకి ఇబ్బంది ఉండదనుకున్న చోటే పొంగులేటి టీఆర్ఎస్ పోటీ చేస్తుంది. కనీసం 15 చోట్ల గెలవాలన్నది శ్రీనన్న ధ్యేయంగా కనిపిస్తోంది. బీజేపీ, పొంగులేటి మధ్య జరుగుతున్న చర్చల్లో కూడా అదే అంశం పదే పదే ప్రస్తావనకు వస్తోంది….

ఓట్లు చీల్చడమే వ్యూహం….

బలమైన, సమర్థులైన, విశ్వాస పాత్రులైన నేతలనే ముందుంచాలని పొంగులేటి డిసైడయ్యారు. అందుకే ఖమ్మం జిల్లా ఇన్‌చార్జిగా స్వయంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తుండగా, మహబూబ్‌నగర్‌ జిల్లా ఇన్‌చార్జిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నల్లగొండ జిల్లాకు చకిలం అనిల్‌కుమార్‌, వరంగల్‌ జిల్లా బాధ్యతలు తన వియ్యంకుడైన మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారునికి అప్పగించినట్లు తెలుస్తోంది. పైగా బీజేపీకి అనుకూలంగా ఉండే విధంగా అధికార బీఆర్ఎస్ ఓట్లు చీల్చాలి. కమలం పార్టీ నేతలు పొంగులేటికి అప్పగించిన బాధ్యత కూడా అదే. బీజేపీకి 30 నుంచి 40 స్థానాలు వచ్చినా.. పొంగులేటికి వచ్చే 15 స్థానాలను కలుపుకుని తెలంగాణలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వెనుకాడకూడదని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. అప్పుడు పొంగులేటికి డిప్యూటీ సీఎం పదవికి కూడా వస్తుంది. ఇతర పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కొందరు నేతలను లాగే వీలుంటుంది. ఏదో విధంగా కేసీఆర్ ను ఓడించడమే ఇరు వర్గాల ముందున్న కర్తవ్యం..