రాబోయే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో గెలవటం అన్నది తెలుగుదేశంపార్టీకి చాలా ప్రిస్టేజ్ అయిపోయింది. గడచిన నాలుగు ఎన్నికల్లో కొడాలినానీ కంఫర్టబుల్ గా గెలుస్తున్నారు. చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్ ను కొడాలి ఎంతటా టార్గెట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అందుకనే రాబోయేఎన్నికల్లో కొడాలికి ఎలాగైనా చెక్ పెట్టాలని చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంతమంది నేతల పేర్లను పరిశీలించినా కొడాలిని ఢీ కొనేంత సీనుందని చంద్రబాబు అనుకోవటంలేదు.
సరిగ్గా ఈ నేపధ్యంలోనే నందమూరి అలేఖ్యారెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. అలేఖ్యారెడ్డి ఎవరంటే చనిపోయిన నందమూరి తారకరత్న భార్య. రాబోయే ఎన్నికల్లో గుడివాడలో ఎన్టీయార్ కుటుంబం నుండి ఎవరైనా పోటీకి దిగితే గెలుపు సాధ్యమేమో అనే ఆలోచన కూడా ఉంది. ఈ నేపధ్యంలోనే తారకరత్న, చైతన్య కృష్ణ, సుహాసిని పేర్లు ప్రచారమయ్యాయి. తారకరత్న పోటీకి బాగా ఆసక్తిచూపారు. అయితే హఠాత్తుగా చనిపోయారు.
అందుకనే ఇపుడు అలేఖ్యారెడ్డిని పోటీలోకి దింపితే గెలుపు ఖాయమని స్వయంగా నందమూరి బాలకృష్ణే సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. బాలయ్య సూచనకు చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నారట. అన్నీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అలేఖ్య అభ్యర్ది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అలేఖ్య నిజంగానే కొడాలికి గట్టి పోటీ ఇవ్వగలరా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.
గుడివాడ టీడీపీలో పెద్ద సమస్య ఏమిటంటే ఎన్నికకు ఒక అభ్యర్ధిని మార్చటమే. 2014లో రావి వెంకటేశ్వరరావు పోటీచేస్తే 2019లో దేవినేని అవినాష్ పోటీచేశారు. రాబోయే ఎన్నికల్లో మరో కొత్త అభ్యర్ధి. ఇందుకనే పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ఓడిపోతున్నది. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించకుండా కొత్త అభ్యర్ధులను రంగంలోకి దింపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అలేఖ్య పోటీచేస్తుందని ప్రచారం మొదలవ్వగానే తమ్ముళ్ళల్లో టెన్షన్ మొదలైంది. ఇంతకాలం పార్టేనే అంటిపెట్టుకుని, కష్టపడుతున్న తమను కాదని కొత్తవాళ్ళకి టికెట్ ఇస్తే ఎలాగ అనే చర్చ పెరిగిపోతోంది. అసలు తారకరత్న చనిపోయిన తాలూకు సెంటిమెంటు ఉందా అన్నది అసలైన ప్రశ్న. మరి చివరకు చంద్రబాబు ఏమిచేస్తారో చూడాలి.