ఏపీ అధికార పార్టీ వైసీపీ భయపడుతోందా? వచ్చే ఎన్నికల సమయానికి ప్రతిపక్షాల దూకుడును అడ్డుకునే ప్రయత్నం చేస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు నెటిజన్లు.అందుకే.. ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన జీవో 1కి మరింత పదును పెడుతున్నారని వారు చెబుతున్నారు. ఇప్పటికే ఈ జీవోపై అనేక విమర్శలు వచ్చాయి . దీంతో న్యాయ పోరాటాలు కూడా జరిగాయి. అయితే.. అనూహ్యంగా జీవో 1పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం పుంజుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ప్రస్తుతం టీడీపీ దూకుడు పై ఉంది. ఒకవైపు యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలు చెబుతున్నారు. నారా లోకేష్ కూడా.. ప్రజల సమస్యలు వింటూనే సెల్పీ ఛాలెంజులతో సర్కార్‌కు సవాళ్లు రువుతున్నారు. ఇక, సీఎం జగన్‌పైనా.. వైసీపీ నేతలపైనా తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇక, చంద్రబాబు కూడా.. పర్యటనలకు ఎక్కడా వెనుకంజ వేయడం లేదు.
దీంతో ఏపీలో సహజంగానే ప్రతిపక్షాలు పుంజుకున్నట్టు అయింది. ఇదే జరిగితే.. వైసీపీ సర్కారుకు వచ్చే ఎన్నికల్లో ప్రభావం తగ్గుతుందని.. గుండుగుత్తగా ఏకపక్షంగా వైనాట్ 175 నినాదంతో దూసుకుపోయే పరిస్థితి ఉండదని.. భావిస్తోంది. దీంతోనే జనవరిలో ఎప్పుడో 1835ల నాటికి బ్రిటీష్ చట్టాన్ని తీసుకువచ్చి.. జీవో 1గా మార్చి.. అమలు చేసేందుకు రెడీ అయింది. సభలు, సమావేశాలు, రోడ్ షోలు అడ్డుకోవడం.. ఈ జీవో ప్రధాన ఉద్దేశం.
అయితే, దీనిపై తీవ్ర విమర్శరావడం.. హైకోర్టులో కేసులు పడడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో పిటిషనర్లు(టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర) సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా.. నిర్ణయాన్ని హైకోర్టుకు వదిలేశారు. ఈ పరిణామాలతోనే సీఎం జగన్ తాజాగా జీవో 1 పేరు ఎత్తకుండానే.. సభలు, సమావేశాలు.. రోడ్ షోల పై మరింత ఉక్కుపాదం మోపాలంటూ.. ఆదేశాలు జారీ చేశారు. అయితే.. జగన్ కామెంట్లు విన్న తర్వాత.. నెటిజన్లు.. వైసీపీ సర్కారు ప్రతిపక్షాలకు భయపడుతోందా? వచ్చే ఎన్నికలకు భయపడుతోందా? అని ప్రశ్నిస్తుండడం గమనార్హం.