ఒక్క సీటు కూడా గెలవం – మోదీకే చెప్పేసిన నేతలు

ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి మొదటి నుంచి ఆగమ్య గోచరంగానే ఉంది. ఎవరి పంచనో చేరి నాలుగు సీట్లు సంపాందించుకుని ఎంజాయ్ చేయడం మినహా సొంత బలం పై ఎప్పుడూ గెలిచింది లేదు. సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిన దాఖలాలు కనిపించవు.

ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు రాష్ట్రంలో బీజేపీ విజయావకాశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.. ప్రస్తుతం ఒక సీటు కూడా లేదు కదా…. 2024 ఎన్నికల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారని ఆయన వాకబు చేశారు. దానికి అంత సీన్ లేదని కొందరు నేతలు కుండబద్దలు కొట్టారట. వచ్చే ఎన్నికల్లోనూ ఒక్క సీటు రాదని మోదీ మొహానే వాళ్లు చెప్పేశారట. ఏమిటీ ఒక్క సీటు కూడా రాదా అని అడుగుతూ మోదీ ఆశ్చర్యపోయారట.

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో బీజేపీ నేత విష్ణు కుమర్ రాజు ఈ సంగతి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. నేరుగా మోదీ దగ్గరే చెప్పెయ్యాల్సిన దీన స్థితిలోకి పార్టీ వచ్చిందని విష్ణు కుమార్ రాజు వాపోయారు. పైగా జగన్‌ను ఓడించి తీరాల్సిందేనని లేని పక్షంలో మరింత అరాచకం ప్రబలుతుందని విష్ణు అంటున్నారు. పైగా విశాఖ రాజధాని తమ అజెండా కాదని కూడా విష్ణు తేల్చేశారు.