ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఎటు పోతోందో? ఏమవుతోందో ప్రస్తుత సీఎం జగన్‌కు ఏమాత్రమైనా తెలుస్తోందా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో సన్‌రైజ్ రాష్ట్రం గా ఉన్న ఏపీ.. ఇప్పుడు సన్ సెట్ రాష్ట్రంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ మహిళకు ఉండే జ్ఞానం సీఎం జగన్‌కు కానీ, వైసీపీ పేటీఎం బ్యాచ్కు కానీ ఉందా? అని ప్రశ్నించారు. నాలుగేళ్ల పాలనలో వ్యవస్థలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో కొత్తగా ఒక్క పరిశ్రమనైనా తీసుకువచ్చారా అని నిలదీవారు.
రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏటికేడు కొనుగోలు శక్తి తగ్గిపోవడం.. దేనికి సంకేతమో కూడా ఈ సీఎంకు తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోందని చంద్రబాబు విమర్శించారు. యువత మేల్కొకుంటే భవిష్యత్ లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ పెద్దలు, అవినీతి కారణంగా పారిశ్రామికవేత్త లు వెనక్కి మళ్లిపోతున్నారని చంద్రబాబు ఆరోపించారు. అమరావతి పూర్తయితే రాష్ట్ర ఆదాయం, పోలవరం పూర్తి చేసి ఉంటే రైతుల ఆదాయం పెరిగేదని చంద్రబాబు చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రజలంతా ఆలోచించాలని చంద్రబాబు కోరారు.
సన్ రైజ్ రాష్ట్రం.. కాస్తా..
టీడీపీ హయాంలో సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ముందుకెళ్లాం అని గుర్తు చేసిన చంద్రబాబు.. 2016 సంవత్సరం నాటికే ఎఫ్‌డీఐలను ఆకర్షించే టాప్-3 రాష్ట్రాల్లో ఏపీ ఉందని తెలిపారు. రాష్ట్రానికి వెయ్యి కిలో మీటర్ల విశాల సముద్ర తీరప్రాంతం ఉందని, అనేక దేశాలతో వ్యాపారం చేయవచ్చని వెల్లడించారు. రాష్ట్రాన్ని 2021లోగా నంబర్‌వన్ చేయాలని ప్రణాళిక వేసుకుని అనేక దేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించామని చెప్పారు. కృష్ణపట్నం నుంచి భావనపాడు వరకు పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, టీడీపీ హయాంలో రూ.16 లక్షల పెట్టుబడులు తెచ్చామని వెల్లడించారు.
రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు తిరిగి వెనక్కి ఎందుకెళ్లారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వల్ల అనేక కంపెనీలు ఏపీ నుంచి పారిపోయాయని, అవినీతి, బెదిరింపుల వల్లే అనేక పరిశ్రమలు వెళ్లిపోయాయని తెలిపారు. అదానీ డేటా సెంటర్‌కు టీడీపీ హయాంలోనే శంకుస్థాపన చేశాం.. కడప ఉక్కు పరిశ్రమకు ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు?.. భోగాపురం విమానాశ్రయంపై జగన్‌కు ఏమైనా స్పష్టత ఉందా? అని ప్రశ్నించారు.
“హైదరాబాద్‌లో 5 వేల ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించాం.. భోగాపురంలోనూ భోగాపురం విమానాశ్రయానికి 2,700 ఎకరాలు సేకరించాం” అని చంద్రబాబు తెలిపారు. విమానాశ్రయానికి ఎన్నో అడ్డంకులు కల్పించిన వైసీపీ నేతలు.. ఇపుడు 500 ఎకరాలు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారని ప్రశ్నించారు. రామానాయుడు స్టూడియోకు ఇచ్చిన భూమిలోనూ కొంత తీసేసుకున్నారని తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికీ ఇలాంటి పరిస్థితి రాలేదని, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఏపీ అంటే భయపడేలా చేశారని చంద్రబాబు మండిపడ్డారు.