బీజేపీ ఓటుబ్యాంకుపై కాంగ్రెస్ కన్ను

రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఓటుబ్యాంకుపై గట్టిగానే కన్నేసింది. బీజేపీకి ముంబై కర్నాటక ప్రాంతం చాలా కీలకం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏడు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల్లో బీజేపీకి మంచి పట్టుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే లింగాయతుల ఓటు బ్యాంకే. పై 50 నియోజకవర్గాల్లో లింగాయతులే గెలుపోటముల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్. లింగాయతులు ఎవరికి ఓట్లేస్తే ఆ పార్టీయే గెలుస్తుందనటంలో సందేహంలేదు.

మొదట్లో లింగాయతులు కాంగ్రెస్ కే మద్దతుగా ఉండేవారు. ఎప్పుడైతే లింగాయతుల్లో కీలకమైన వీరేంద్రపాటిల్ ను అప్పటి రాజీవ్ గాంధి ముఖ్యమంత్రిగా తొలగించారో అప్పటినుండే లింగాయతులు కాంగ్రెస్ కు దూరమయ్యారు. పక్షవాతంతో తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పాటిల్ ను రాజీవ్ తొలగించటమే లింగాయతుల కోపానికి కారణమైంది. దాన్ని యడ్యూరప్ప అడ్వాంటేజ్ తీసుకున్నారు. అలా దశాబ్దాల పాటు యడ్యూరప్పతోనే లింగాయతులు నడిచారు.

విచిత్రం ఏమిటంటే బీజేపీ నుండి యడ్యూరప్ప బహిష్కరణకు గురయ్యారు. తర్వాత ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని పోటీచేశారు. అప్పట్లో యడ్యూరప్పకు పడిన ఓట్లన్నీ లింగాయతులవే. యడ్యూరప్ప సొంతంగా పార్టీ పెట్టుకున్న కారణంగా లింగాయతుల ఓట్లు బీజేపీకి కాకుండా యడ్యూరప్ప పార్టీకి పడ్డాయి. దాంతో లింగాయతుల దెబ్బ బీజేపీ మీద పడింది. ఆ విషయాన్ని గ్రహించిన బీజేపీ తర్వాత యడ్యూరప్పను మళ్ళీ బీజేపీలోకి తీసుకున్నది. లింగాయతుల్లో అంతటి పట్టున్న యడ్యూరప్ప ఇపుడు ఎన్నికల నుండి తప్పుకున్నారు.

దాంతో రాబోయే ఎన్నికల్లో లింగాయతులు ఏమి చేయబోతున్నారనేది కీలకమైంది. ఎందుకంటే నరేంద్ర మోడీ, రాహుల్ గాంధి ముంబై కర్నాటకపైనే ఎక్కువ దృష్టిపెట్టారు. యడ్యూరప్పను బీజేపీ అవమానించి ఎన్నికల నుండి తప్పించిందని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ప్రచారాన్ని బీజేపీ తిప్పికొట్టలేకపోతోంది. లింగాయతులకే చెందిన జగదీష్ షెట్టర్, లక్ష్మణసవది లాంటి బలమైన లింగాయత్ నేతలు బీజేపీపై తిరుగుబాటు లేవదీసి కాంగ్రెస్ లో చేరారు. ఇలాంటి డెవలప్మెంట్లతో బీజేపీ బలహీనపడిందనే అంటున్నారు. రెండు పార్టీల్లోను లింగాయత్ సామాజికవర్గాలకు చెందిన నేతలున్నారు. దాంతో పోలింగ్ రోజున లింగాయతులు ఏ విధంగా స్పందిస్తారనేది ఎవరికీ అర్ధంకావటంలేదు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.