ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఆధిపత్య పోరు రోజురోజుకూ ముదురుతోంది. ప్రతీ నియోజవర్గంలో ఇద్దరు నేతలకు మధ్య విభేదాలు, వివాదాలు నిత్యకృత్యమయ్యాయి. కొందరు నేతలు వీధిన పడి కొట్టుకుంటుంటే.. మరికొందరు చాప కింద నీరులా ముసుగులో గుద్దులాటకు పోతున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఆ పోరు తారా స్థాయికి చేరింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి విశ్వరూప్ కు, ఎంపీ అనురాధకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కార్యకర్తలు కూడా రెండుగా విడిపోయి రాజకీయాలు చేసుకుంటున్నారు. మంత్రి విశ్వరూప్.. ఎంపీ అనురాధ…ఇద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలే.. . సీనియర్ మంత్రి అన్న ధీమాలో విశ్వరూప్ ఉంటే.. ఎంపీని అనే దర్పాన్ని అనురాధ ప్రదర్శిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో అనురాధ ఎంపీ పదవి కి కాకుండా అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పైగా విశ్వరూప్ కి ఈ సారి సీటు రాదనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. అందుకే ముందు నుంచి ప్రణాళిక ప్రకారం సీఎస్సార్ నిధులను మంత్రి నియోజకవర్గ౦లో ఎంపీ ఖర్చు చేస్తున్నారు.ఇది తెలిసిన మంత్రి తన సీటుకు ఎసరు పెడుతుందని గమనించి ఆ మధ్య చమురు కంపెనీలకు లేఖ రాసి తనకు తెలియకుండా తన నియోజకవర్గ౦లో సీఎస్సార్ డబ్బులు ఖర్చు చేయొద్దని చెప్పినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..
అమరాపులం కిమ్స్ కళాశాల మైదానంలో అనురాధ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరిగాయి. ఆ పోటీలను ఓఎన్జీసీ స్పాన్సర్ చేయగా, అనురాధ అనుచరులు డబ్బు తినేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రచారమంతా విశ్వరూప్ బ్యాచ్ చేసిందేనని అనురాధ వర్గం అనుమానిస్తోంది.
అమలావురం అల్లర్లలో విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టనప్పుడు అనురాధ కనీసం సానుభూతి ప్రకటించలేదని ఆయన వర్గం ఆరోపించింది. ఆమెపై దుమ్మెత్తిపోసింది. దళితులకు వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చడం లేదని అనురాధ ఒక సదస్సులో ఆరోపించడం విశ్వరూప్ ను ఉద్దేశించినదేనని ఆయన అనుచరులు ఆగ్రహం చెందుతున్నారు. ఏంపీ మాటల్లో అవగాహనా రాహిత్యం ఉందని విశ్వరూప్ నేరుగానే ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే ఆమె అనుమానిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో మొదలైన ఈ వైరం ఇంకా కొనసాగుతోంది. 2024లో ఎవరికి టికెట్ వస్తుంది.. జగన్ ఎవరికి మొండిచేయి చూపిస్తారో చూడాలి. అప్పుడే సమరం ఆగుతుందనుకోవాలి..