నా చొక్క నా ఇష్టం…

ఎవరైనా కడుపు నింపుకోవడానికి దొంగతనం చేశారనుకోండి.. జనమంతా  వాళ్ల మీద పడి చితగ్గొట్టేస్తారు. అదే డబ్బున్నవాళ్లో, రాజకీయ నాయకులో పక్కనోడి పెన్ను తీసి జేబులో పెట్టుకున్నారనుకోండి… ఆయన సరదాపడి తీసుకున్నారు అందులో తప్పేముందీ అన్నట్లుగా మాట్లాడేస్తారు. అదీ సమాజ నైజం..

ఎవరైనా రోడ్డు మీదకు వచ్చి అక్కడే చొక్కా విప్పి తిరుగుతూ గోల చేస్తే వాడికి  పిచ్చి పట్టిందంటారు. అదే ఎమ్మెల్యేనో, మంత్రో, మాజీ ఎమ్మెల్యేనో చేస్తే రాజకీయ ఉద్యమంగానో, ప్రజాపోరాటంగానో చిత్రీకరించి చప్పట్లు కొడతారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నదదే. నాయకులు ఇప్పుడు పోటీ పడి చొక్కాలు విప్పి, గుండెలు  చూపిస్తున్నారు..

ఉమ్మడి ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినప్పుడు ఆయన్ను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. అదేదో ధర్నా చేస్తున్నారనుకుంటే తప్పులేదు. ఆ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఏపీ మంత్రి ఆదుమూలపు సురేష్ నాయకత్వం వహించడమే విడ్డూరం. పైగా అప్పుడు జరిగిన వాగ్వాదంలో సురేష్ సడన్ గా చెక్కా విప్పేసి గోల చేశారు. అలా చేయమని ఎవరడిగారు. సురేష్ ఎందుకలా చేశారంటే వెంటనే సమాధానము దొరకలేదు.  కేవలం డైవర్ట్  చేసేందుకు మంత్రి సురేష్ అలా ప్రవర్తించారని తేలిపోయింది.

కట్ చేసి చూస్తే తాడిపత్రి బదర్స్ లో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా చొక్కా విప్పేసి గుండెలు చూపారు. ఫ్లెక్సీల రాజకీయంలో డీజిల్ దొంగ ఎవరూ అంటూ జేసీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు తాడిపత్రి టౌన్ మొత్తం నింపేశారు. దానితో  రెచ్చిపోయిన ప్రభాకర్ రెడ్డి ప్లెక్సీ దగ్గరే గోల చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న పెద్దారెడ్డి అని నినాదాలు చేస్తూ ఫ్లెక్సీకి  ముద్దులు పెట్టారు. పైగా ప్రజల మనసు దోచుకున్న గజదొంగతానేనంటూ చొక్కా విప్పి గుండెను చూపించారు. దానితో అక్కడున్న జనం అవాక్కయ్యారనుకోండి..

సురేష్, ప్రభాకర్ రెడ్డి చిన్నవాళ్లేమీ కాదు. నిరక్ష్యరాస్యులేమీ కాదు.  బాగా చదువుకున్న వాళ్లే.. ఆదిమూలపు సురేష్, ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫీసర్ గా పనిచేశారు. ప్రభాకర్  రెడ్డి కూడా  చదువుకున్న నాయకుడే. అయినా ఎందుకీ చిల్లర పనులన్న ప్రశ్న తలెత్తుతోంది. తమ ప్రాబల్యం తగ్గిపోతుందన్న భయంతో, జనం దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి ప్రయత్నాలకు ఒడిగడుతున్నారన్న  చర్చ జరుగుతోంది. పైగా వాళ్లవీ ఎండే గుండెలూ కాదు.. మండే గుండెలు కాదు.  రాజకీయాల్లో ఉన్నవాళ్లంతా గుండెలు తీసిన బంట్లే….