ఇటీవల కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా మీడియాలో ఉంటున్న ఏపీ మంత్రి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు.. మరో అవే వివాదాస్పద వ్యాఖ్యలతో హైలెట్ అయ్యారు. ఈ సారి ఏకంగా.. ఆయన సొంత పార్టీ నేతలను.. ప్రజలను కూడా టార్గెట్ చేశారు. పదువులు కావాల్సిన వాళ్లే.. సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని.. ఆయనను సైకో.. అని పిచ్చోడని ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రజలకు డబ్బులు ఇస్తున్నందునే అభివృద్ధికి అవకాశం లేకుండా పోయిందనేది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
‘ఇష్టముంటే ఓటేయండి.. లేకపోతే మానేయండి’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలనుద్దేశించి పరుషంగా వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పాత్రునివలసలో నిర్మించిన టిడ్కో ఇళ్లను శనివారం మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ధర్మాన మాట్లాడారు. సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాల కారణంగానే ప్రజలకు ఇప్పుడు భారీగా చేతినిండా డబ్బులు ఉన్నాయని.. అయినా.. కొన్ని వర్గాలు, పార్టీలు, చానెళ్ల మాటలు విని.. చెడిపోతున్నారని అన్నారు.
‘పేదల పని అంటే సీఎం జగన్ ఆషామాషీగా తీసుకోరు. అధికారులకు సూచనలిచ్చినప్పుడు అన్నీ పక్కాగా ఉండాలని చెబుతారు. పిచ్చోడు, క్రాక్ అయితే ఇలాంటి పనులన్నీ చేస్తారా..? మీకు ఇష్టముంటే ఓటేయండి.. లేకపోతే మానేయండి. అది వేరే విషయం. కానీ అలా మాట్లాడటం తప్పు. ఈరోజు మీరంతా సంతోషంగా ఉండటానికి కారణం వైసీపీ ప్రభుత్వం, దాని అధినేత జగన్. చప్పట్లు కొట్టమన్నా మనకి చేతకాదు. అంతటి గొప్ప హృదయం ఉన్నవాళ్లం మనం“ అని అసహనం వ్యక్తం చేశారు.
“ఇంట్లో ఉండి తెలిసీ తెలియని విషయాలు టీవీలో, పేపర్లలలో చూసి అదే నిజమనుకుంటాం. తగలబెట్టేస్తున్నారండీ రాష్ట్రాన్ని అంటారు. ఎవరి వల్ల తగలబడిపోయింది. మీ వల్లే.. మీకు డబ్బులు ఇవ్వడం వల్లే రాష్ట్రం తగలబడిపోయిందని అనుకుంటే అనుకోండి. మీ పిల్లల్ని చదివించడం, ఇల్లు కట్టించి ఇవ్వడం తగలబెట్టేయడమా? ప్రతినెలా మీకు వస్తున్న డబ్బులు ఎక్కడివి. ఎవరో అంటే మీరు అనేయడమే. కొంచెం అర్థం చేసుకోండి. ఓట్ల కోసం కాదు. ఎన్నికల్లో పోటీ చేయనని ముఖ్యమంత్రికి చెప్తున్నా. పదవులు కావాల్సిన వాళ్లే జగన్‌ను సైకో అని.. పిచ్చోడు అని అంటున్నారు” అని ధర్మాన వ్యాఖ్యానించారు.