ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫైట్..బొత్సకు టెన్షన్

విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు రచ్చకెక్కడంతో ఏం చేయాలో తోచక అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తోంది. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించినప్పటికీ ఆ ఇద్దరు నేతల అనుచరులు దారికి రావడం లేదు.. వారిని కట్టడి చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ కొత్త మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది..

శృంగవరపు కోట ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ విజయఢంకా మోగించింది. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వర్గం బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలనుకున్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. గజపతినగరం నియోజకవర్గంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన కడుబండి శ్రీనివాసరావుని గత ఎన్నికల్లో శృంగవరపుకోట నుండి బరిలోకి దించింది. గెలుపు బాధ్యతలు రఘురాజు చేతిలో పెట్టింది. గెలిపించుకొని వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి అలంకరిస్తావని ఇందుకూరికి నేరుగా ముఖ్యమంత్రి జగనే ఇచ్చిన హామీ బాగా ప్రచారంలోకి వచ్చింది. దీంతో రఘురాజు, ఆయన సతీమణి సుధారాజు రాత్రి, పగలు తేడా లేకుండా ప్రచారంలో హోరెత్తించారు. తమ అభ్యర్ధిని గెలిపించుకున్నారు. హామీ ఇచ్చినట్లుగా అధిష్టానం రఘురాజును ఎమ్మెల్సీని చేసింది.

ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్న తర్వాత కడుబండి శ్రీనివాసరావు వార్ వన్ సైడ్ అన్నట్లుగా వ్యవహించారు. రఘురాజును ఆయన వర్గాన్ని దూరం పెట్టాలని డిసైడయ్యారు. ఆ దిశగా అడుగులు వేస్తూ నియోజకవర్గంలో పదవులు రఘురాజు వర్గానికి అందకుండా చూసుకున్నారు. దానితో గత ఏడాదిగా రఘురాజు రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు వర్గంపై దాడులకు కూడా వెనుకాడబోమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి ఛాన్స్ ఎందుకివ్వరని రఘురాజు వర్గం అధిష్టానాన్నే నిలదీస్తోంది. పైగా స్థానిక ఎన్నికల జరిగినప్పుడు ఎస్.కోట, కొత్తవలస, వేపాడ, ఎల్.కోట, జామి మండలాల నుండి గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఎమ్మెల్యేని తక్షణమే మార్చేయాలని మండలాల వారీగా తీర్మానాలు చేసి అధిష్టానానికి పంపించేశారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పంచాయతీ జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ దగ్గరకు చేరింది. ఒకటి రెండు సార్లు ఆయన సర్దిచెప్పారు. అప్పటికీ ఇరు వర్గాలు దారికి రాలేదు. ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నారని శ్రీనివాసరావు వర్గం, తాము లేకపోతే ఎమ్మెల్యే లేరని రఘురాజు వర్గం మీసాలు మెలేస్తున్నారు. దానితో బొత్సకు బాగా కోపమొచ్చింది. పార్టీలో ఉంటే ఉండండి.. పోతే పోండీ అని మీడియా సాక్షిగ్గా కన్నెర్ర చేశారు..

బొత్స తమ మాట వినకపోవడంతో రఘురాజు వర్గం రూటు మార్చింది. ఐదు మండలాలకు చెందిన వైసీపీ కేడర్ తో కలసి పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. ఆ వర్గానికి రఘురాజు సతీమణి సుధ నాయకత్వం వహించారు. రఘురాజుకు టికెట్ ఇవ్వకపోతే కష్టమని, క్షత్రియులకు అవమానం జరిగినట్లుగా భావించాల్సి ఉంటుందని ప్రకటించేశారు. కొంచెం ఓపిక పట్టాలని సీఎం జగన్ తో మాట్లాడి అన్ని విషయాలు సెటిల్ చేస్తానని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. అయినా వాళ్లు తగ్గేదేలే అంటున్నారు.

రఘురాజు వర్గం ఒక నిర్ణయానికి వచ్చింది. ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఎన్నికల్లో ప్రచారం చేసే ప్రసక్తే లేదని తేల్చేసింది. దానితో ఇప్పుడు శృంగవరపు కోటలో టీడీపీ నేతలు పండుగ చేసుకుంటున్నారట. వైసీపీలో విభేదాల కారణంగా తాము ప్రచారం చేయకుండానే గెలిచిపోతామని చెప్పుకుంటున్నారట… ఏం జరుగుతోంది..