తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు, ప్రస్తుతం పార్టీ నుంచి సస్పెన్షన్‌లో ఉన్న ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ జీవితం ప్రసాదించింది టీడీపీనేనని తెలిపారు. టీడీపీ వల్లే తాను ఇంతవాడిని అయ్యానని చెప్పారు. ఏపీలో ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు సీఎం అవుతారని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన ప్రచారం అవాస్తవమని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు వల్లేనని, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసేదేమీలేదని అన్నారు. అలాగే కాంగ్రెస్ కూడా ఏమీ చేయలేదని విమర్శించారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని, తనకు రాజకీయ జీవితం ఇచ్చింది బాబేనని రాజాసింగ్ పేర్కొన్నారు. అయితే తానొక హిందూవాదినని, ధర్మం కోసం పనిచేస్తానని అన్నారు. తన మనస్థత్వానికి టీడీపీ కూడా మ్యాచ్ కాదని, తనకు మ్యాచ్ అయ్యే పార్టీ ఒక్క బీజేపీయేనని, తనకు టీడీపీలో చేరే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇండిపెండెంట్‌గా అయినా..
బీజేపీ ఒకవేళ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని రాజాసింగ్ తెలిపారు. తనకు గోషామహల్ ప్రజలు అండగా ఉన్నారని.. ఉంటారని చెప్పారు. ధర్మ రక్షణ, గోరక్షణ విషయాల్లో తాను ముందుంటానని… అందుకే గోషామహల్ ప్రజలు తనను గౌరవిస్తారని చెప్పారు. అయితే.. బీజేపీ తనకు టిక్కెట్ ఇస్తుందనే ఆశలు ఉన్నాయని, పార్టీ పెద్దల ఆశీర్వాదం కూడా మెండుగా ఉందని రాజా సింగ్ చెప్పుకొచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates