పెద్దలతో  కష్టం..పిల్లల్ని నమ్మలేం..

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అందరికంటే ఎక్కువ సమయం పార్టీ కోసం కేటాయిస్తున్నారు. నెలకు ముూడు సార్లైన జిల్లాల పర్యటనలకు వెళ్తూ అక్కడ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎక్కడికక్కడ సమీక్షలు  నిర్వహిస్తూ విజయావకాశాలను  బేరీజు వేసుకుంటున్నారు. మరో ఏడాది తిరక్కుండానే జరిగే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలన్న ఆలోచన వచ్చినప్పుడల్లా కొన్ని నియోజకవర్గంలో  దిక్కుతోచని పరిస్థితి ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఎలా  చేయాలి, ఎవరికీ కోపం రాకుండా మేనేజ్ చేయడమెలా, అందరినీ  కలుపుకుపోతూ నెగ్గే నాయకుడెవ్వరూ లాంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు చంద్రబాబుకు సమస్యలు ఎదురవుతున్నాయట.

1990ల్లో చంద్రబాబు పార్టీ  బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎవరు బాగా పనిచేస్తున్నారు.. ఎవరికి టికెట్లిచ్చాం.. ఇప్పుడు వాళ్ల పరిస్థితేమిటని సమీక్ష చేసుకుంటే మార్పు దిశగా చంద్రబాబుకు దిక్కు తోచడం లేదని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఎన్టీయార్ హయాం నుంచి వచ్చిన వారే పార్టీలో ఇంకా చక్రం  తిప్పుతున్నారని విశ్లేషించుకుని కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట.  కుటుంబాలకు కుటుంబాలు  పార్టీలో ఉంటూ పెత్తనం చెలాయించిన వారూ ఉన్నారు. తర్వాతి కాలంలో పార్టీలో చేరిన వాళ్లు కూడా పాతుకుపోయి  ఇప్పుడు ఆధిపత్యానికి  లోటు  లేకుండా చూసుకుంటున్నారు.

కొత్తవారికి అవకాశం  ఇచ్చే క్రమంలో వారసులే ఎక్కువగా చంద్రబాబు కంటికి కనిపిస్తున్నారట..పైగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని నమ్మకం పెరిగిపోవడంతో చాలా మంది సీనియర్లు, రాజకీయాల్లో తమ వారసులను సెటిల్  చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు కాకపోతే మరోసారి అవకాశం రాదని వాళ్లు అర్థం  చేసుకున్నారట. దానితో తాము పోటీ చేయబోవడం లేదని తమ పిల్లలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. ఆ ప్రతిపాదనలే ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా మారాయని  విశ్లేషణలు వినిపిస్తున్నాయి..

పిల్లలకు రాజకీయ అనుభవం లేకపోవడం, దూకుడు తప్పితే వ్యూహాత్మక ముందడుగు వేసే లక్షణం కనిపించకపోవడం, సరైన నాయకత్వ లక్షణాలు అలవాటు చేసుకోకుండా పిచ్చి ప్రేలాపనలకు దిగడం లాంటి చర్యలతో చాలా మంది వారసులు నవ్వుల పాలవుతున్నట్లు చంద్రబాబు చేయించిన సర్వేల్లో తేలింది. ముందు  వెనుక చూసుకోకుండా మాట్లాడే తీరు పార్టీకి ఇబ్బంది కలిగిస్తోందని కూడా చంద్రబాబు గుర్తించారట. రాజకీయ ఓనమాలు కూడా నేర్చుకోకుండా పదవులు కావాలని, వీలైతే యువ మంత్రిననిపించుకోవాలని చాలా మంది వారసులు లెక్కలేసుకుంటున్నట్లుగా చంద్రబాబు దృష్టికి వచ్చింది..

తనయుడు నారా లోకేష్ ను రాజకీయాల్లో ఆరితేరన నేతగా తీర్చిదిద్దేందుకు యువగళం పాదయాత్ర ప్లాన్ చేసిన చంద్రబాబుకు ఇప్పుడు  అతనికి  తోడుగా రాజకీయ వ్యవస్థను అర్థం  చేసుకున్న యువనేతలు కావాలి. కాకపోతే ఎటు  చూసిన ముందువరుసలో వారసులే  కనిపిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్న చింతకాయల అయ్యన్న పాత్రుడు తన కుమారుడు విజయ్ ను ఎంపీగా చూడాలని ముచ్చట పడుతున్నారట. అనకాపల్లి ఎంపీ సీటు తన కొడుక్కి ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు గట్టిగా  పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా నుంచి వెళ్లి ఉత్తరాంధ్రలో సెటిలైన మరో సీనియర్ గంటా శ్రీనివసరావు కూడా తన సుపుత్రుణ్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని సరదా పడుతున్నారు. గంటా రవితేజకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.  కళా వెంకట్రావు ఆలోచన కూడా అదే  తన కొడుకు కిమిడి రాం మల్లిక్ కు తన స్థానంలో టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు.

ఇక మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అయితే ఇప్పటికే తన కూతురు గ్రీష్మను పార్టీ మహానాడుకు పంపించి హడావిడి చేయించారు. గ్రీష్మ కూడా చాలా యాక్టివ్ గా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. తొడకొట్టి మరీ తనకు టికెట్ కావాలని చెప్పేశారు. పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్ నే రాజకీయ తెరపై చూడాలని అనుకుంటున్నారు. నోటికొచ్చిన  బుతులు అందుకునే జేసీ సోదరులు కూడా వారసులను చంద్రబాబు చేతిలో పెట్టి కృష్ణారామ అనుకోవాలని డిసైడయ్యారు. జేసీ పవన్, జేసీ అస్మిత్ లకు చెరో పదవి  ఇస్తే మేము హ్యాపీస్ అని సందేశం పంపుతున్నారు.ఇక మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన కుమార్తె  దివ్యను తునిలో నిలబెట్టి గెలిపించుకుంటానంటున్నారట.

చాలా మంది నేతలు తమ వారసులను రంగంలోకి దినంపాలనుకున్నా.. వారిలో ఎంత మంది గెలుస్తారో చంద్రబాబుకు అర్థం  కావడం లేదు. పైగా పది కాలాల పాటు పార్టీని నిలబెట్టే సమర్థత ఎంతమందికి ఉందో అంచనా వేయలేకపోతున్నారు. అదే ఇప్పుడు చంద్రబాబు టెన్షన్ కు కారణమవుతోంది..