చంద్ర‌బాబుపై తిట్లు ప‌నిచేయ‌డం లేదా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌లు కామ‌నే. ఏ పార్టీ అయినా.. ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకునేందుకు.. త‌మ పార్టీ పుంజుకునేం దుకు ప్ర‌త్య‌ర్థి పార్టీపైనా.. నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం స‌హ‌జ‌మే. దీంతో గ‌త నాలుగేళ్లుగా.. అధికార పార్టీ నేత‌లు..చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల‌ను విమ‌ర్శించ‌డంతోపాటు.. అనేక రకాల మాట‌ల‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ఇక‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా.. ఇదే పంథాలో ముందుకు సాగారు. సీఎంగా ఆయ‌న ఏసభ‌లో పాల్గొన్నా.. కూడా.. చంద్ర‌బాబు ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తున్నారు.

చంద్ర‌బాబు వృద్ధుడు అయిపోయాడ‌ని.. తోడేళ్ల మంద‌కు నాయ‌కుడ‌ని.. ఇలా జ‌గ‌న్ విరుచుకుప‌డుతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ తిట్ల‌ను ప్ర‌జ‌లు హ‌ర్షించ‌డం లేద‌ని.. వ‌రుసగా రెండోసారి కూడా రుజువు అయింది. కొన్నాళ్ల కింద‌ట శ్రీకాకుళంలో పోర్టుకు శంకుస్థాప‌న చేసిన సీఎం జ‌గ‌న్ .. అక్క‌డ నిర్వ‌హించిన స‌భ‌లో మాజీ సీఎం చంద్ర‌బాబుపై వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న వ‌ల్లే రాష్ట్ర నాశ‌నం అయింద‌న్నారు. చంద్ర‌బాబు వ్య‌ర్థుడ‌ని దూషించారు. దీంతో.. అప్ప‌టి వ‌ర‌కు స‌భ‌లో ఉన్న జ‌నాలు.. చంద్ర‌బాబును తిడుతుండే స‌రికి లేచి వెళ్లిపోయారు.

వెళ్లేందుకు మార్గం లేక‌పోయినా.. స‌రే.. ఏదో ఒక దారిలో వెళ్లిపోయారు. ఇక‌, తాజాగా అనంతపురం జిల్లాలో సీఎం జగన్ ‘జగనన్న వసతి దీవెన’ కింద లబ్దిచేకూర్చే సభ నిర్వ‌హించారు. చంద్రబాబుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న పులి క‌థ చెప్పారు. అయితే.. సీఎం జ‌గ‌న్ చంద్ర‌బాబును తిడుతున్న స‌మ‌యంలో సభ నుంచి ప్ర‌జ‌లు లేచి వెళ్లిపోయారు. స‌భ‌లో ఏర్పాటు చేసిన‌ మూడంచెల బారికేడ్లను సైతం దాటుకుని జగన్ ప్రసంగిస్తుండగానే.. ప్రజలు వెళ్లిపోయారు.

సో ..ఈ ప‌రిణామాల‌ను అంచ‌నా వేస్తున్న ప‌రిశీల‌కులు..చంద్ర‌బాబుపై తిట్లు ప‌నిచేయ‌డం లేద‌ని అంటున్నారు. ప్ర‌జ‌లు అభివృద్ధి కోరుకుంటున్నార‌ని.. చంద్ర‌బాబును తిట్టడం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని అంటున్నారు. ఇదే విష‌యంపై వైసీపీలోనూ చ‌ర్చ‌సాగుతున్న‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా త‌న స‌భ నుంచి జ‌నాలు వెళ్లిపోవ‌డం.. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తుంటే.. జ‌నాలు పారిపోవ‌డం వంటివి సీఎం జ‌గ‌న్‌సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రి మున్ముందు ఏమైనా మార్చుకుంటారేమో చూడాలి.