ఎమ్మెల్యేల అవినీతిపై కేసీఆర్ ఫైర్‌

సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై సీఎం కేసీఆర్ ఫైర‌య్యారు. చాలా మంది ఎమ్మెల్యేలు అవినీతి బాట ప‌ట్టార‌ని హెచ్చ‌రించారు. ఎన్నిక‌ల‌కు ముందు.. ఇలా చేయ‌డం స‌రైన చ‌ర్య‌కాద‌న్నారు. ముఖ్యంగా ద‌ళితుల‌కు ఉద్దేశించిన కీలక‌మైన‌ ప‌థ‌కం.. ద‌ళిత బంధును ఆస‌రా చేసుకుని సొమ్ములు బొక్కేయ‌డం స‌రికాద‌న్నారు. కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని, వాళ్లెవ‌రో కూడా త‌న ద‌గ్గ‌ర చిట్టా ఉంద‌ని చెప్పుకొచ్చారు.

ఇదే చివరి వార్నింగ్‌.. మళ్లీ రిపీట్‌ అయితే టికెట్‌ దక్కదని కేసీఆర్ హెచ్చ‌రించారు. అవినీతికి పాల్ప‌డుతున్న ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కేసీఆర్‌ హెచ్చరించారు. అనుచరులు వసూలు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత అని తేల్చి చెప్పారు.

షెడ్యూల్ ప్ర‌కార‌మే!
షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలన్నారు. లేకపోతే నష్టపోతారని, సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కట్‌ చేస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్‌.. ఆసాంతం ఎమ్మెల్యేల ప‌నితీరుపై దృష్టి పెట్టారు.

అదేజాతీయ నినాదం..!

‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు జాతీయ స్థాయిలో పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నామ‌ని..సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ ప్ర‌యాణంలో అనేక ఇబ్బందులు వ‌స్త‌య్‌. అనేక లొల్లిలు తెర‌మీద క‌న‌బ‌డ‌తై.. అయినా.. మొక్క‌వోని దీక్ష‌తో ముందుకు సాగాల‌! అని దిశానిర్దేశం చేశారు.