తెలంగాణ ఓటర్లపై రిజర్వేషన్ అస్త్రం

బీజేపీని తెలంగాణలో అధికారానికి తీసుకొస్తే ముస్లిం కోటాను రద్దు చేస్తామని చేవెళ్ల సభలో అమిత్ షా ప్రకటించినప్పుడు జనం లైట్ తీసుకున్నా.. అందులో చాలా సీరియస్ నేస్ ఉందని తేలిపోయింది. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ 12 శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్ భావిస్తున్న తరుణంలోనే అమిత్ షా బీ-52 బాంబర్ తో దాడి చేసినట్లయ్యింది. పక్కా వ్యూహంతోనే ఎన్నికల ముందు అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నట్లు సమాచారం. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ప్రచార అస్త్రంగా మలుచుకోవాలని బీజీపీ నిర్ణయించింది. కర్ణాటక ఫార్ములానే తెలంగాణలో కూడా ప్రయోగించాలని బీజేపీ నిర్ణయించింది. అమిత్ షా ప్రకటనతో హిందూ ఓట్లను ఏకం చేస్తాయని కమలం పార్టీ భావిస్తోంది. ఇదే సమయంలో అమిత్ షా ప్రకటనను బీఆర్ఎస్, కాంగ్రెస్ లు, ఎంఐఎంలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

రిజర్వేషన్ విధానాన్ని పునసమీక్షించాలని చాలా రోజులుగా డిమాండ్లు వస్తున్నాయి. రిజర్వేషన్ రద్దు బీజేపీ, ఆరెస్సెస్ రహస్య అంజెడా అని కొన్ని దళిత సంఘాలు ఆరోపిస్తున్నారు. ముమ్మారు తలాఖ్ రద్దు, కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే 370వ అధికరణం రద్దు తర్వాత రిజర్వేషన్ రద్దు కూడా బీజేపీ అజెండాలో తదుపరి అంశమని ఆ పార్టీ వ్యతిరేకులు కొందరు వాదిస్తున్నారు. ఆ మాట నిజమెంతో తెలీదు కానీ, అమిత్ షా ప్రకటన మాత్రం ఆలోచింపజేస్తోంది. పైగా తెలంగాణలో మాట్లాడిన మాటే ఆయన కర్ణాటకలో కూడా రిపీట్ చేశారు. ఇప్పటికే కర్ణాటక ముస్లిం రిజర్వేషన్ అంశం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉంది. మే 10 వరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం కన్నడ ప్రభుత్వాన్ని ఆదేశించింది..

తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తామని పదే పదే చెబుతున్న అమిత్ షా తాజా వ్యాఖ్యల వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎంకు చెక్ పెట్టడంలో భాగంగానే అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల అంశం తెరమీదకు తీసుకొచ్చారని బీజేపీ వర్గాల‌ సమాచారం. అందులోనూ కొన్ని సార్లు రహస్యంగా, కొన్ని సార్లు బహిరంగంగా మిత్రపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎంలను ఒకేసారి దెబ్బకొట్టాలని బీజేపీ భావిస్తోంది. ముస్లింలు ప్రాబల్యం ఉన్న యాభై నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఇదీ బీఆర్ఎస్ కు ప్రయోజనం కలిగించే చర్యగా బీజేపీ అనుమానించింది. అందుకే ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ ఓట్లను సంఘటితపరిచే దిశగానే రిజర్వేషన్ రద్దు అంశాన్ని తెరమీదకు తెచ్చినట్లు భావిస్తున్నారు.

ముస్లిం మైనారిటీ ఓట్లును చీల్చితే బీఆర్ఎస్, ఎంఐఎం ను దెబ్బ కొట్టొచ్చని అమిత్ షా భావించారు. నాన్ ముస్లిం ఓట్లను ఏకం చేసి వీలైతే గంపగుత్తగా బీజేపీకి పడేట్టుగా చూడటం కోసం అమిత్ షా మాట్లాడుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిన కర్ణాటక తప్పితే ఎక్కడా బీజేపీ అధికారంలో లేదు. ఏదో విధంగా తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలం పార్టీ భావిస్తుంది. అప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ లబ్ధి పొందే అవకాశం ఉందని నమ్ముతోంది. ఎందుకంటే ఉత్తరాదిన లోక్ సభా స్థానాలు తగ్గితే వాటిని తెలంగాణ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలతో భర్తీ చేసుకోవచ్చు.