అన్ని చెప్పారు..అసలు సంగతి మరిచారు.. కేడర్ నిరాశ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పల్నాడు టూర్ కు ప్రజాస్పందన పెల్లుబికిన మాట వాస్తవం. అమరావతి, ధరణికోట, పెద కూరపాడు, పెదమక్కెన ఎక్కడ చూసిన నేల ఈనినట్లుగా జనం వచ్చారు.. ఫైనల్ గా బుధవారం రాత్రి సత్తెనపల్లిలో జరిగిన బహురంగ సభకు జనం కిక్కిరిసిపోయారు. కదిలితే ఊపిరాడనంతగా వచ్చిన జనం రాత్రి పది గంటల తర్వాత కూడా అదే ఉత్సాహంతో నిలబడి ప్రతీ మాటాకు కేరింతలు కొట్టారు.

ఐదు కోట్లు వర్సెస్ సైకో..

పొరపాటున మళ్లీ జగన్ కు అవకాశం ఇస్తే పిల్లల భవిష్యత్‌ అంధకారమవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల ఆస్తులకు, మహిళలకు రక్షణ ఉండదన్నారు. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి. లేదంటే ఆత్మహత్యలే గతి అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అందరి జీవితాలూ ప్రమాదంలో పడ్డాయన్నారు. జగన్‌ రూ.2.10 లక్షల కోట్లు దోపిడీ చేశాడని ఆరోపించారు. ప్రజలపై రూ.5 లక్షల కోట్ల భారం వేశాడని, జనం పేరుతో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశాడన్నారు. ఒక్క రోడ్డయినా వేశాడా? గంజాయి కూడా మాఫియాగా మారింది. గంజాయి అక్రమ రవాణాలో దేశంలోనే మన రాష్ట్రం నంబర్‌ వన్‌గా మారింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మంది జనం ఒక వైపున ఉన్నారని సైకో ఒక్కడే ఒక వైపున ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు..సైకోను వదిలించుకోవడానికి జనమంతా ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు..

ఇంఛార్జ్ ఎవరో చెప్పని అధినేత

చంద్రబాబు తరచూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నప్పటికీ పార్టీ సత్తెనపల్లి ఇంఛార్జ్ ని మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్న మాట వాస్తవం. సత్తెనపల్లి సభలో పార్టీకి చెందిన మూడు నాలుగు గ్రూపులు హడావుడి చేశాయి. బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు తమ వంతు కృషి చేశాయి. అయినా చంద్రబాబు ఎవరి పేరు ప్రకటించకపోవడం లోటుగానే అనిపించింది. మాజీ స్పీకర్ కోడెల కుమారుడు శివరాం కూడా జనాన్ని పట్టుకొచ్చారు. చంద్రబాబు చాలా సేపు కోడెల గొప్పదనాన్ని ప్రశంసించారే తప్ప శివరాంకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు.

అబ్బూరి మల్లి పరిస్థితేమిటి ?

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు అలియాస్ అబ్బూరు మల్లి అందరికంటే ఎక్కువగా పనిచేసి బహిరంగ సభను సక్సెస్ చేశారని చెబుతున్నారు. రెండు వేల బైకులు, 300 కార్లు పెట్టి చంద్రబాబు ర్యాలీని సక్సెస్ చేశారు. 15 వేల మంది కార్యకర్తలకు భోజనం పెట్టారు. జగన్ ప్రభుత్వం అన్న క్యాంటిన్లు మూసేసిన తర్వాత స్వయంగా తన డబ్బులతో సత్తెనపల్లి బస్టాండ్ దగ్గర అన్న క్యాంటిన్ ఏర్పాటు చేశారు. రోజు 500 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నారు. రెండు దశాబ్దాలుగా పార్టీ రాష్ట్ర నేతలు ఎవరు సత్తెనపల్లి వచ్చినా అబ్బూరు మల్లి వారిని కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. మన మల్లి, మన సత్తెనపల్లి నినాదం విస్తరిస్తున్నా అధిష్టానం నుంచి స్పందన రాలేదన్న చర్చ చాలా రోజులుగా సాగుతోంది. కాకపోతే ఈ సారి చంద్రబాబు ఆయన సేవలను గుర్తించారని చెబుతున్నారు.

కన్నాపైనే దృష్టి..

బీజేపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతోంది. మరో వారం రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ రావచ్చు. కన్నా కూడా నాలుగైదు సార్లు సత్తెనపల్లిలో పర్యటించి క్రీయాశీల నేతలందరినీ టచ్ చేశారు. ఒకవేళ జనసేన, టీడీపీ పొత్తులో తనకు టికెట్ వస్తే విజయావకాశాలు మెరుగు పరుచుకునేందుకు ఈ చర్యలు ఉపక్రమిస్తాయని కన్నా భావిస్తున్నారట. పైగా గతంలో పొరుగు నియోజకవర్గమైన పెదకూరపాడుకు ఆయన నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో సత్తెనపల్లి రాజకీయులతో ఆయనకు స్నేహబంధాలు ఉండేవి. ఏదైనా చంద్రబాబు తొందరగా తేల్చాలి కదా అన్నది సత్తెనపల్లి టీడీపీ కార్యకర్తల మాట. మొదటి నుంచి ఉన్న వారికి గౌరవప్రదమైన పదవులు ఇస్తే బావుంటుందని కొందరంటున్నారు..