సీఎం జగన్‌ను కలుసుకునేందుకు ఈ నాలుగేళ్లలో ఏ సామాన్యుడు ప్రయత్నించినా.. అది దుర్లభంగానే మారింది. ఇక, నిరసనలు.. ఉద్యమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో సీఎం జగన్‌కు సామాన్యుల ఆక్రందనలు తెలియడం లేదు. అయితే.. అనూహ్యంగా బుధవారం మాత్రం సీఎం జగన్‌కు నిరసనల సెగ తగిలింది. ఏకంగా.. ఎంతో భద్రతలో ఉన్న జగన్ కాన్వాయ్‌ను రైతులు అడ్డగించారు. తమకు న్యాయం చేయాలంటూ.. రోడ్డుపై పడుకుని కాన్వాయ్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో సీఎం జగన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం జగన్ బుధవారం పర్యటించారు. తిరిగి వస్తున్న క్రమంలో సీఎం జగన్ కాన్వాయ్‌ని తుంపర్తి భూనిర్వాసితులు అడ్డుకున్నారు. నష్టపరిహారంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ రోడ్డుపై బైఠాయించి సీఎం జగన్‌పై రైతులు శాపనార్థాలు పెట్టారు. ముఖ్యంగా నలుగురు మహిళలు కాన్వాయ్‌కు అడ్డంగా రోడ్డుపై పడుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో రైతులను పక్కకు నెట్టేసి సీఎం కాన్వాయ్‌ని పోలీసులు పంపించారు. సీఎం జగన్ పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
రోడ్డు మార్గంలో ఎందుకు వెళ్లారంటే.. అనంతపురం పర్యటనలో తిరిగి వచ్చేప్పుడు ముఖ్యమంత్రి జగన్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నార్పలలోనే హెలికాఫ్టర్ నిలిచిపోయింది. సాంకేతికలోపం కారణంగా హెలికాఫ్టర్‌లో పుట్టపర్తికి వెళ్లాల్సిన జగన్.. రోడ్డుమార్గాన బయలుదేరి వెళ్లారు. నార్పల నుంచి బస్సు ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టపర్తికి బయలుదేరారు. దీంతో ఇదే సమయంగా భావించిన రైతులు.. సీఎం జగన్‌కు తమ నిరసన వ్యక్తం చేశారు.
విద్యాదీవెన విడుదల!
బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించిన జగన్ నార్పలలో ‘‘జగనన్న విద్యా దీవెన’’ పథకం నిధులను విద్యార్థుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని సీఎం తెలిపారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్లు జమ చేశారు. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున సాయం అందించామని జగన్ పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates