వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే ఒకట్రెండు సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగేలా మాట్లాడింది ఆయన సోదరి షర్మిళ. వివేకా హత్య కేసు నుంచి అవినాష్ రెడ్డిని ఎలాగైనా బయటపడేయాలని జగన్ ప్రయత్నిస్తుంటే.. షర్మిళ మాత్రం అవినాష్‌కు ఈ కేసులో సంబంధం ఉందన్నట్లుగానే మాట్లాడుతోంది మొదట్నుంచి. అవినాష్ అండ్ కో ఆరోపిస్తున్నట్లుగా వివేకా హత్య కేసుకు, ఆస్తుల వ్యవహారానికి సంబంధం లేదని, కడప ఎంపీ సీటు విషయంలోనే ఆయన హత్య జరిగి ఉండొచ్చని ఇంతకుముందే షర్మిళ స్పష్టం చేసింది. తాజాగా మరోసారి ఈ కేసు విషయమై షర్మిళ మీడియాతో మాట్లాడింది. జగన్, అవినాష్‌లను ఇరుకున పెట్టేలాగే ఆమె వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
వైఎస్ వివేకాపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం దారుణమని షర్మిళ వ్యాఖ్యానించారు. ఆస్తులు కోసమే వివేకా హత్య జరిగిందనే ఆరోపణలను ఆమె ఖండించారు. తన చిన్నాన్న వివేకా ఆస్తులన్నీ సునీత పేరు మీదే ఉంచారని, అన్ని ఆస్తులు ఎప్పటి నుంచో సునీత పేరు మీదే ఉన్నాయని షర్మిళ స్పష్టం చేసింది. అలాంటప్పుడు సునీత ఆస్తుల కోసమో లేకపోతే ఆస్తి ఇంకెవరికో రాసిస్తాడనో సునీత కంగారు పడిందనే లాజిక్‌లో అసలు అర్థమే లేదన్నారు.ఒకవేళ కొందరు ఆరోపిస్తన్నట్లు సునీత భర్త ఆస్తి కోసమే ఇలా చేశారనుకుంటే చంపాల్సింది వివేకానందరెడ్డిని కాదని.. ఆస్తి సునీత పేరు మీద ఉంది కాబట్టి సునీతనే చంపాలని ఆమె అన్నారు. ఆస్తి కోసం వివేకాను సునీత, ఆమె భర్త ఏదో చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని షర్మిళ తేల్చి చెప్పారు.
వివేకా ప్రజల మనిషని.. అలాంటి వ్యక్తి గురించి కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కథనాలు ప్రసారం చేస్తున్నాయని.. ఆ సంస్థలకు ఇలా మాట్లాడే అర్హతే లేదని షర్మిళ వ్యాఖ్యానించారు. అసలు లేని వ్యక్తి మీద, తనకు తాను సంజాయిషీ ఇచ్చుకోలేని వ్యక్తి మీద కొన్ని మీడియా సంస్థలు ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వార్తలు, కథనాలు ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిళ పేర్కొంది. ఇటీవలి తన అరెస్టు నేపథ్యంలో జగన్ అసలు స్పందించకపోవడం, తనకు అండగా నిలిచే ప్రయత్నం చేయకపోవడంతో షర్మిళ తీవ్ర అసంతృప్తి చెందిన నేపథ్యంలోనే ఆయన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడినట్లు భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates