వైసీపీ అధినేత, సీఎం జగన్ నోరు తెరిస్తే.. అబద్ధాలు మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తొలుత ముస్లిం కుటుంబాలతో భేటీ అయ్యారు. వారికి పలు హామీలు ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి మసీదుకు రిజిస్ట్రేషన్ చేయించాలని, కరెంట్ బిల్లులో సబ్సిడీ ఇవ్వాలనే విషయాన్ని తప్పకుండా పరిశీలనలోకి తీసుకొని పార్టీ అధికారంలోకి వచ్చా హామీ నెరవేరుస్తామన్నారు. మైనారిటీలతో ప్రత్యేక సమావేశం చేయడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం మైనారిటీలను మోసం చేసిందని విమర్శించారు.
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన ఘనత తమదేనని చంద్రబాబు అన్నారు. దుల్హన్ పథకం అమలు చేశామని, దీనిపై వైసీపీ నిబంధనలు పెట్టి.. దుల్హన్ పథకాన్ని నాశనం చేసిందన్నారు. రంజాన్ తోఫా ఇచ్చి పేద ముస్లింల ఇంట టీడీపీ వెలుగులు నింపామన్నారు. ఇప్పుడు ముస్లింలకు ఇవ్వాల్సిన పథకాలకు వైసీపీ తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం పరిపాటయిందన్నారు.
వెయ్యి కోట్ల ధారాదత్తం
జగన్ అధికారంలోకి రాగానే సాక్షి పేపర్‌కు రూ. 1000 కోట్ల యాడ్స్ ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. ప్రతి పథకానికీ లబ్ధి దారులకు డబ్బులు ఇచ్చారో లేదో తెలియదు కానీ సాక్షి పత్రికకు ఠంచనుగా యాడ్ మాత్రం ఇచ్చారని విరుచుకుడ్డారు. గతంలో మసీదులు, ఈద్గాలు, మౌలానాలకు జీతాలు ఇచ్చామన్నారు. ఈ ప్రభుత్వం మైనారిటీ సోదరులపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు. ముస్లిం మైనారిటీలకు తన ప్రాణం అడ్డుపెట్టి కాపాడుతానన్నారు. జగన్ పోలీసులతో కేసులు పెట్టి పరిపాలన చేయాలని చూస్తున్నారని.. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఏపీలో టీడీపీ కార్యకర్తలు ప్రజలు బ్రతుకుతున్నారన్నారు.