ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. ఆయనను అరెస్టు చేయొద్దన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది. అంతేకాదు.. సీబీఐ ఎంతో సంయమనంతో వ్యవహరిస్తోందని కూడా కితాబునిచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తే.. సీబీఐ ఎంపీ అవినాష్‌ను అరెస్టు చేయడం ఖాయమనే తెలుస్తోంది.
నేడో రేపో.. ఏక్షణంలో అయినా.. అవినాష్‌ను సీబీఐ అరెస్టు చేయడం తథ్యమని న్యాయనిపుణులు చెబు తున్నారు. ఇదే జరిగితే.. ఏపీపై ప్రభావం ఎంత? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. ఇప్పటి వరకు అవినాష్‌ను అరెస్టు కాకుండా.. అనేక ప్రయత్నాలు చేశారంటూ.. సీఎం జగన్‌పై విమర్శలు వచ్చాయి. అంతేకాదు.. ఒక సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడుతూ.. అవినాష్‌ను తన తమ్ముడని కూడా జగన్ వ్యాఖ్యానించారు.
మరి అలాంటి ఎంపీని సీబీఐ అరెస్టు చేస్తే.. వైసీపీలో కలకలం రేగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పైగా.. కడపలో ఇప్పుడు వైసీపీ బాధ్యతలను ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కూడా అవినాష్ కుటుంబమే చూస్తోంది. పైగా ఎన్నికలకు ఏడాది సమయమే ఉండడంతో ఎంపీ అరెస్టు కనుక జరిగితే వైసీపీకి కోలుకోలేని ఇబ్బందేనని పరిశీలకులు చెబుతున్నారు. అయినా.. ప్రయత్నాలు మాత్రం ఫలించేలా కనిపించడం లేదు.
ఇక, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ముఖ్యంగా కడప అయితే.. సోమవారం మధ్యాహ్నం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నుంచి పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అదేవిధంగా.. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ అప్రకటిక 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అంటే.. అవినాష్ అరెస్టు జరిగితే.. పరిణామాలను ఎదుర్కొనేందుకు పార్టీ పరంగాను.. ప్రభుత్వ పరంగానూచర్యలు తీసుకుంటున్నారు. మరి వాస్తవిక పరిణామాలపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates