గుంటూరు బరిలో సుజనా చౌదరి ..?

ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుతం ఏపీ బీజేపీలో కీలక నేత సుజనా చౌదరి గుంటూరు లోక్ సభా స్థానం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుత టీడీపీ ఎంపీ అయిన పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ మరోసారి పోటీకి ఆసక్తి చూపడం లేదని తెలియడంతో సుజనా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

గుంటూరు నగరంలో ఇటీవల టీడీపీ, బీజేపీ నేతల తేనీటి విందు జరిగింది. టీడీపీ నేత ఆలపాటి రాజా నివాసంలో జరిగిన భేటీలో సుజనా చౌదరి, టిడిపికి చెందిన రాష్ట్ర మాజీ మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా సహా పలువురు సమావేశమయ్యారు. టీ తాగి పిచ్చాపాటీ మాట్లాడేందుకు పిలిచారని అనుకున్నా.. అసలు చర్చ సుజనా పోటీపైనే అని తెలిసింది. సుజనా రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. లోక్ సభకు పోటీ చేయాలన్న కోరిక ఉన్నట్లు తెలుస్తోంది.

సుజనా గతంలో టీడీపీలో పనిచేసినందున ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఆ పార్టీ నేతలతో ఆయనకు సన్నిహత సంబంధాలున్నాయి. కన్నా బీజేపీలో ఉన్నప్పుడు సుజనాతో స్నేహంగా ఉండేవారని చెబుతున్నారు. దానితో ఆయన అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్థిస్తారని అంటున్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు కుదురితే కమలం పార్టీ టికెట్ పై సుజనా పోటీ చేయాలని లేనిపక్షంలో టీడీపీలో చేరి ఆ పార్టీ తరపున బరిలో దిగాలని చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉండే జిల్లా కావడంలో సుజనాను పోటీలోకి దించితే విజయం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఈ అంశాలపైనే ఆలపాటి రాజా నివాసంలో చర్చలు జరిగాయి. నిజానికి నరసరావుపేట ఎంపీ టికెట్ అడుగుతున్న రాయపాటి సాంబశివరావుకు గుంటూరు టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు కూడా భావించారు. అయితే వయోభారంతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను ఇక రిటైర్ చేయడమే మంచిదన్న భావన పార్టీ అధిష్టానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అన్ని విధాలా సుజనాకు లైన్ క్లియర్ అయినట్లు భావించాల్సి ఉంటుంది..