ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తూ.. మూడు రాజధానుల తీర్మానానికి గవర్నర్ చేత జగన్ సర్కారు ఆమోద ముద్ర వేయించుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఐతే అమరావతి విషయంలో బాబుకు చిత్త శుధ్ధి ఉన్నా.. లేదంటే మూడు రాజధానుల ప్రతిపాదనపై జనాభిప్రాయం ఏంటో తెలుసుకోవాలన్నా.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాలు విసురుతున్నారు వైకాపా నాయకులు. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఇదే డిమాండ్ చేసి బాబును ఇరుకున పెట్టారు. దీనిపై బాబు ఎలా స్పందిస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఐతే బాబు దీనికి ప్రతిగా కొత్త సవాల్ విసిరారు.
మొత్తంగా అసెంబ్లీనే రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు సవాలు విసరడం విశేషం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్.. అమరావతికి మద్దతు ఇచ్చి ఎన్నికల తర్వాత మాట తప్పారన్న బాబు.. ఇలా మాట తప్పినందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్దామని సవాల్ విసిరారు. ఇప్పుడు ప్రభుత్వం ఎత్తుకున్న మూడు రాజధానుల ప్రతిపాదనను ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. జగన్ ఏపీ ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు.. ఏపీ రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల సమస్య అని.. కులాలు, మతాల సమస్య కాదని చెప్పారు. ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడానికి 48 గంటలు సమయం ఇస్తున్నామని.. అలా అయితే తామందరం రాజీనామా చేసేందుకు సిద్ధమని బాబు ప్రకటించారు. దీనిపై వైకాపా నాయకులేమంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates