పవన్ ఉద్దేశం జనసైనికులకు అర్థమవుతోందా?

2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే తమ పనైపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ బలంగానే నమ్ముతున్నట్లుగా ఉంది. అందుకే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొడవకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తోంది. టీడీపీ, జనసేన ఇప్పుడే పొత్తులపై అధికారికంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఈలోపు.. ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య వీలైనంత మేర దూరం పెంచి.. పొత్తు పొడవకుండా చూసే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు.

ఒకవేళ పొత్తు కుదిరినా.. టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసి పని చేసే వాతావరణం లేకుండా, ఓట్ల బదిలీ జరగకుండా చేయాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే సోషల్ మీడియాలోనే కాక బయట కూడా టీడీపీ, జనసేన మధ్య చిచ్చు రగల్చడానికి ఏదో ఒక వ్యూహం రచిస్తూనే ఉన్నారు. ఇందుకోసం జనసేనలో వైసీపీ ప్రోగా ఉండే కొందరు నాయకులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ పరిస్థితిని గమనిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులకు ఇందులో పవన్ హితబోధ చేశారు. ప్రత్యర్థుల ఉచ్చులో పడకుండా, జాగ్రత్తగా మాట్లాడాలని.. సంయమనం పాటించాలని పవన్ సూచించాడు. మన దృష్టిని మళ్లించడానికి, భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు పని చేస్తున్నాయంటూ వైసీపీ మీద పరోక్షంగా కౌంటర్ వేశాడు జనసేనాని.

పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా మాట్లాడొద్దని.. ఈ విషయంలో మేలు చేసే నిర్ణయాన్ని స్వయంగా తానే తీసుకుంటానని పవన్ చెప్పాడు. అలాగే మనతో సయోధ్యగా ఉన్న రాజకీయ పక్షాల్లో చిన్న చితకా నాయకులు మనపై ఏవైనా విమర్శలు చేసినా.. ఆ విమర్శలు ఆ నాయకుని వ్యక్తిగతమైనవిగా భావించాలని.. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దని పవన్ సూచించాడు.

ఈ రెండు పాయింట్లను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు పవన్ సిద్ధమయ్యాడని.. ఆ పార్టీతో ఘర్షణ వైఖరి వద్దని చెప్పకనే చెబుతున్నట్లుంది. అదే సమయంలో పొత్తు గురించి ఇప్పుడు ఎక్కువ చర్చ వద్దని.. సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని పవన్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సరైన ఆధారాలు లేకుండా ఎవరి మీదా ఆరోపణలు చేయొద్దని చెప్పడం చూస్తే.. మైత్రీ మూవీ మేకర్స్‌లో వైసీపీ మంత్రి బాలినేనికి పెట్టుబడులు ఉన్నాయనే జనసేన కార్పొరేటర్ ఫిర్యాదు ఆధారంగానే ఈ సూచనగా భావిస్తున్నారు. ప్రస్తుతం మైత్రీ బేనర్లోనే పవన్ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని జనసైనికులకు పవన్ చెప్పకనే చెప్పినట్లయింది.