మ‌హానాడు వేదిక మారింది.. రాజ‌మండ్రిలో కాదు.. !

ఏటా మే 28న టీడీపీ ఘ‌నంగా నిర్వ‌హించే మ‌హానాడు వేదిక నిర్ణ‌యం జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఏడాది మ‌హానాడును రాజ‌మండ్రిలో నిర్వ‌హించాల‌ని పార్టీ నాయ‌కులు భావించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం.. త‌పిస్తున్న టీడీపీ బ‌ల‌మైన వ‌ర్గం ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజ‌మండ్రిలో మ‌హానాడును నిర్వ‌హించాల‌ని త‌ల‌పోసింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు బుచ్చ‌య్య చౌద‌రి, ఆదిరెడ్డి భ‌వానీ వంటివారు స్థ‌లం కోసం కూడా అన్వేషించారు.

అయితే.. అనూహ్యంగా ఈ వేదిక‌ను విజ‌య‌వాడ‌కు మార్చారు. విజ‌య‌వాడ శివారులోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న తాడిగ‌డ‌ప 100 అడుగుల రోడ్డులో మ‌హానాడుకు వేదిక రెడీ కానుంది. దీనికి సంబంధించి భూమి పూజను మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఎన్టీఆర్‌ శత జయంతి కమిటీ చైర్మన్‌ టీడీ జనార్ధన్ మాట్లాడుతూ… ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.

సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ ఒక చరిత్ర సృష్టించారని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు వెంకట నారాయణ రచించిన “ఎన్టీఆర్‌ చారిత్రక ప్రసంగాలు- అసెంబ్లీ ప్రసంగాలు” పుస్తకం ఆవిష్కరణ ఉంటుందన్నారు. వెబ్‌సైట్, సావనీర్ హైదరాబాద్‌లో త్వరలోనే ఆవిష్కరిస్తామని చెప్పారు. ఈ సభకు చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ పాల్గొంటారన్నారు. ఎన్టీఆర్‌ యాప్‌ను నారా లోకేష్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

కాగా, తన నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ శత జయంతి ‌వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని మాజీ ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ అన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, రజనీకాంత్ ఒకే వేదిక మీద చూడటం కనుల విందుగా ఉంటుందన్నారు. లక్షలాది మంది అభిమానులు ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగం అవుతున్నారని తెలిపారు.