ష‌ర్మిల‌కు బెయిల్‌.. కానీ.. సంచ‌ల‌న ఆంక్ష‌లు!

పోలీసులపై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్ అయి చంచ‌ల్ గూడ జైలులో సోమ‌వారం రాత్రంగా గ‌డిపిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు.. వైఎస్ ష‌ర్మిల‌కు నాంప‌ల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ వాద‌న‌లు..తీవ్ర ఉత్కంఠ అనంత‌రం.. సంచ‌ల‌న ఆంక్ష‌ల‌తో బెయిల్ మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం. తొలుత‌ మంగళవారం ఉద‌యం కోర్టులో బెయిల్ పిటిష‌న్ పై వాద‌న‌లు జ‌రిగాయి.

ఈ పిటిషన్‌పై షర్మిల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్లన్నీ(350, 353) ఆరు నెలలు, మూడు సంవత్సరాలలోపు జైలు శిక్ష పడేవే అని తెలిపారు. షర్మిల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలియజేశారు. హైకోర్టు నిబంధనలను కూడా పోలీసులు పాటించడం లేదని చెప్పారు.

షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న ఒక్క వీడియోనే సోష‌ల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. అంతకంటే ముందు చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు.. వాటికి సంబంధించిన‌ వీడియోల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక‌, పోలీసుల త‌ర‌ఫున ప్ర‌భుత్వ న్యాయ‌వాది వాద‌న‌లు వినిపిస్తూ.. షర్మిల పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు.

షర్మిలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని.. షర్మిలకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కేసులో ఇంకా కొంతమంది సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఆమె రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తూ.. స‌మాజంలో అశాంతిని ప్రోత్స‌హిస్తున్నార‌ని అన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. తీర్పును తొలుత వాయిదా వేసింది. అనంత‌రం.. ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఇవీ.. ష‌ర‌తులు

  • రూ. 30 వేలు వ్యక్తిగత పూచీకత్తు స‌మ‌ర్పించారు.
  • సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసనలు నిర్వహించరాదు.
  • దేశం విడిచి వెళ్లరాదు.
  • రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌రాదు
  • ఎవ‌రినీ దూషించ‌రాదు.
  • పోలీసు వ్య‌వ‌స్థ ప‌ట్ల గౌర‌వంగా వ్య‌వ‌హ‌రించాలి.