వరుసబెట్టి చంద్రబాబునాయుడుపై జరుగుతున్న దాడి ప్రయత్నాలపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయినట్లు సమాచారం. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న విషయం తెలిసిందే. జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న వ్యక్తులకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రత కల్పిస్తుంది. తాజాగా ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో రాళ్ళదాడికి ప్రయత్నం జరిగింది. ఆమద్య తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి పర్యటనలో కూడా దాడికి ప్రయత్నం జరిగింది. అందుకనే చంద్రబాబు భద్రతపై కేంద్ర హోంశాఖ రివ్యూ చేసినట్లు సమాచారం.
చంద్రబాబు పర్యటనల్లో తరచూ ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ రాష్ట్ర డీజీపీని వివరణ అడిగిందట. మరి డీజీపీ ఏమని సమాధానం ఇచ్చారో తెలీదు. ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబు భద్రతాధికారి కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు బలమైన గాయం కావటంతోనే ఎన్ఎస్జీ ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ అయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేత పర్యటనల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లను లోకల్ పోలీసులు చేస్తున్నారు. పోలీసులు అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నా దాడులు ఎలా జరుగుతున్నాయనేది హోంశాఖకు ఆశ్చర్యంగా ఉంది.
ఇక్కడ విషయం ఏమిటంటే ప్రతిచిన్న విషయానికి అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య తీవ్రస్ధాయిలో గొడవలవుతున్నాయి. ఒకపార్టీని మరోపార్టీ రెచ్చగొట్టుకుంటు గొడవలకు దిగుతున్న కారణంగానే గొడవలవుతున్నాయన్నది సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదిక స్పష్టంచేసిందట. యర్రగొండపాలెం గొడవలో రెండుపార్టీల్లోను తప్పుందని ఇంటెలిజెన్స్ నివేదికలు కేంద్రానికి చేరాయట. తప్పు ఎవరిలో ఉన్నా దాడులు చంద్రబాబు దాకా వెళ్ళకుండా ఆపటంలో లోకల్ పోలీసులు విఫలమయ్యారని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడిందట.
ఇప్పుడు 24 గంటలు 12 మంది ఎన్ఎస్జీ సెక్యూరిటి చంద్రబాబుకు కాపలాగ ఉన్నారు. తాజా పరిణామాల నేపధ్యంలో ఈ భద్రతను మరింతగా పెంచే అవకాశం ఉందని సమాచారం. అలాగే చంద్రబాబు పర్యటనల్లో లోకల్ పోలీసుల సంఖ్యను మరింతగా పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రెండుపార్టీలు ఒకదానికి మరొకటి ఎదురు పడకుండా లోకల్ పోలీసులే చర్యలు తీసుకోవాలని డీజీపీని కేంద్ర హోంశాఖ ఆదేశించినట్లు సమాచారం. మరి తర్వాత పర్యటనల్లో ఏమవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates