ప్రత్యర్థిని తేల్చే విషయంలో కేటీఆర్ తొందరపడ్డారా?

తెలంగాణ రాష్ట్ర మంత్రి.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ కీలక వ్యాఖ్య చేశారు. మరికొద్ది నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ.. తమ రాజకీయ ప్రత్యర్థి ఎవరన్న విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. ఎన్నికల్లో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీగా చెప్పేసిన ఆయన.. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు.

తమకు పోటీ కాంగ్రెస్ తోనే అని.. అది కూడా రెండో స్థానంలోనే ఉన్నారన్నారు. తమతో పోలిస్తే కాంగ్రెస్ చాలా దూరంలో ఉందని.. బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ.. సమాజంలో తక్కువన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ -కాంగ్రెస్ లు కలిసిపోయినట్లుగా బీజేపీ గడిచిన కొంతకాలంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీని తమ రాజకీయ ప్రత్యర్థిగా ప్రకటించటానికి బీఆర్ఎస్ ససేమిరా అంటోంది. దీనికి కారణం లేకపోలేదు. ఎన్నికల వేళలో.. కమలనాథులకు ఏ మాత్రం మనో ధైర్యాన్ని కలిగించే వ్యాఖ్య తమ నోటి నుంచి వచ్చినా వారు మరింత దూకుడును ప్రదర్శిస్తాన్న ఉద్దేశంతోనే కేటీఆర్ నోట కాంగ్రెస్ మాట వచ్చినట్లుగా చెబుతున్నారు.

అయితే.. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉందన్న మాటతో గులాబీ పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న వాదన వినిపిస్తోంది. దీనికి కారణం.. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలంతా బీఆర్ఎస్ కు -కాంగ్రెస్ కు సంబంధం ఉందని.. బీజేపీని దెబ్బ తీసేందుకు ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వేళలో.. కేటీఆర్ నోటి నుంచి కూడా కాంగ్రెస్ మాట రావటం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే బీజేపీ నేతలు ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి రూ.25 కోట్లు తీసుకున్నట్లుగా ఆరోపించటం.. దీనికి రేవంత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. గడిచిన కొంతకాలంగా గులాబీ అగ్రనేతలు తమ రాజకీయ ప్రత్యర్థి ఎవరన్న విషయాన్ని ఒకసారి బీజేపీగా.. మరోసారి కాంగ్రెస్ గా చెప్పటం.. ఈ రెండింటిని పుంజుకోకుండా ఎప్పటికప్పుడు ప్లాన్ మారుస్తూ మాట్లాడుతున్న వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా కేటీఆర్ నోటి నుంచి వచ్చిన కాంగ్రెస్ మాటతో.. బీజేపీ వర్గాలు తాము చేస్తున్న ఆరోపణకు బలం చేకూరేలా ఉన్నాయన్న మాటను ప్రచారం చేసుకునే వీలుందని చెప్పాలి. ఇదంతా బీఆర్ఎస్ కు నష్టాన్ని.. బీజేపీకి లాభాన్ని చేకూరుస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంతన్నది కాలమే డిసైడ్ చేయాలి.