ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం.. మా నమ్మకం నువ్వే జగన్.. జగనే మా భవిష్యత్తు కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఈ నెల 7న ప్రారంభమై 20న ముగియాల్సి ఉంది. అయితే..దీనికి వస్తున్న స్పందనతో సీఎంజగన్ ఈ కార్యక్రమాలను ఈ నెల 29 వరకు పొడిగించారని వైసీపీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అదేసమయంలో ఈ కార్యక్రమాలకు భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోందని.. ఇప్పటికి 70 లక్షల మంది మిస్డ్ కాల్ ఇచ్చారని తెలిపింది.
అయితే..నాణేనికి ఒకవైపు మాత్రమే. నిజమే మిస్డ్ కాల్ ఇచ్చారు. 70 లక్షల మంది నుంచి మిస్డ్ కాల్స్ వచ్చిన మాట కూడా వాస్తవమే. ప్రజల్లో రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఇది పైపైనే! నిజం అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం మరో ఏడాదిపాటు పాలన చేయనుంది. దీంతో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు మరో ఏడాది పాటు అందాల్సిన అవసరం ఉంది. దీనిలో కీలకమైన అమ్మ ఒడి, చేయూత వంటి భారీ నగదు కార్యక్రమాలు ఉన్నాయి.
అదే సమయంలో పింఛను 3000 రూపాయలు పెంచేకార్యక్రమం జనవరి నుంచి అమలు కానుంది. ఇది.. వచ్చే ప్రభుత్వాలు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. దీంతో లబ్ధి దారులు..తమకుఇష్టం ఉన్నా లేకున్నా.. వలంటీర్లు, గృహసారథులు వచ్చినప్పుడు వారు చెప్పినట్టు వింటున్నారు. మిస్డ్ కాల్ ఇవ్వమంటే ఇస్తున్నారు. ఇంటికి స్టిక్కర్ అంటిస్తామన్నా.. సరేనంటున్నారు. కానీ, తర్వాతే అసలు విషయం తెరమీదికి వస్తోంది.
వలంటీర్లు, గృహసారథులకు రహస్యంగా వైసీపీ నుంచి ఆదేశాలు వచ్చాయి. మీరు అంటించిన స్టిక్కర్లు వారం తర్వాత.. అలానే ఉన్నాయో లేదో ..పరిశీలించాలనేది ఈ ఆదేశం. దీంతో వలంటీర్లు గడిచిన రెండురోజులు రాష్ట్ర వ్యాప్తంగా అదే పనిచేశారు. సగానికిపైగా ఇళ్లకు స్టిక్కర్లు కనిపించలేదు. దీంతో ఇదే విషయాన్ని వారు పార్టీ అధిష్టానానికి పంపించారు. అంటే.. ప్రజలు వైసీపీ వైపు ఏవిధంగా ఉన్నారనేది ఇప్పుడు స్పష్టంగా అర్ధమైందని అంటున్నారు వైసీపీ నాయకులు. మరి దీనిని ఎలా చూస్తారో చూడాలి.