స్వరూపానంద స్వామి. విశాఖలోని శారదాపీఠాధిపతి. పైగాసీఎం జగన్‌కు..వైసీపీ నాయకులకు ఎంతో ఆత్మీయ స్వామిగా పేరు తెచ్చుకున్నారు. అయితే, ఆయన తాజాగా వైసీపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అప్పన్నను సామాన్య భక్తులకు దూరం చేసేలా దేవదాయ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేదని ఆయన మండిపడ్డారు. పోలీసులను గుంపులుగా పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని విమర్శించారు. తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హజరయ్యానని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు.
ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. కొండ కింది నుంచి పైవరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరన్నారు. తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదని, భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం బాధ కలిగించిందని స్వరూపానందేంద్ర అన్నారు.
కాగా, ఏడాదికి ఒక్కసారిమాత్రమే లభించే అప్పన్న నిజ రూప దర్శనం కోసం ఆదివారం రాష్ట్ర, రాష్ట్రేతర భక్తులు క్యూ కట్టారు. అయితే.. ఏటా భక్తుల రాగ పెరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా చేయాల్సిన అధికారులు కేవలం క్యూ లైన్లు కట్టి మిన్నకున్నారు. పైగా టికెట్ ధరలను ఆసాంతం పెంచేశారు. రూ.500 టికెట్ ధరను ఏకంగా 1500లకు పెంచారు. అదేవిధంగా వీఐపీ దర్శన ఏర్పాట్లు కూడా సరిగా చేయలని వీఐపీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.