నాలుగేళ్ల కిందట ఎన్నికలకు ముందు జగన్ చెప్పిన మాటలన్నీ జనం నమ్మారు. తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. కానీ, నాలుగేళ్లు తిరిగేసరికి జనం జగన్‌ను నమ్మడం మానేశారు. జగన్ మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన ఉండదని.. చెప్పిన పని చేయరని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోరని అర్థం చేసుకున్నారు. అందుకే… 2019లో అమరావతి ప్రజలు జగన్‌ను నమ్మినా ఇప్పుడు వైజాగ్ ప్రజలు మాత్రం జగన్‌ను నమ్మడం లేదు. వైజాగ్‌లోనే ఉంటా, ఇక్కడి నుంచే పాలన సాగిస్తా.. అంటూ జగన్ పదేపదే చెప్తున్నా జనం మాత్రం పట్టించుకోవడం లేదు.
నేను అమరావతిలో ఇల్లు కట్టుకొని కాపురముంటా.. అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా.. అంటూ 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ఎన్నో చెప్పారు. రాజధాని ప్రాంత ప్రజలు ఎంతో విశ్వసించారు. చివరకు అప్పటి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ను కూడా మంగళగిరిలో ఆదరించలేదు. గంపగుత్తగా ఓట్లేశారు. తిరుగులేని ఆధిక్యతనిచ్చారు.
గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది మొదలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. కొన్నాళ్లు మూడు రాజధానులు అన్నారు. ప్రజల్లో ఆశించిన స్పందన రాలేదు. ఇటీవల విశాఖ జపం మొదలెట్టారు. దీనికీ వాయిదాల పర్వం కొనసాగుతూ వచ్చింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సెప్టెంబరు నాటికి వైజాగ్లో కాపురం పెడతానని సీఎం జగన్ తాజాగా ప్రకటించారు. అయితే.. ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం అభివృద్ధి లేకుండా జగన్ వచ్చి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు.
జగన్‌ను ఆయన హామీలే తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. పాదయాత్ర సమయంలో ఎడాపెడా ఇచ్చిన హామీలు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ఎన్నికల ముందు ప్రజా సంకల్పయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ నోచుకోలేదు. అందులో ప్రధానమైనవి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడం. కేంద్రం ఈ విషయంలో ఏపీకి మొండి చేయి చూపిస్తుండగా అదే కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం జగన్ పాకులాడుతున్నారు. అంతేకానీ, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం ఏమాత్రం ఒత్తిడి చేయలేకపోతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంటును కేంద్రం తెగనమ్ముతామన్నా నిలదీయ లేని దుస్థితిలోకి జారిపోయారు. రైల్వే జోన్ ఇవ్వకున్నా ప్రశ్నించలేని దయనీయ స్థితిలో పడిపోయారు. ఉత్తరాంధ్ర, సీమ వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని అడిగితే ఆపాటికే ఇస్తున్న అరకొర ప్యాకేజీని కూడా నిలిపేశారు. అయినా జగన్ మౌనంగానే ఉన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఓ మేజరు పోర్టును నిర్మించాలి. పర్యావరణ సమస్యల వల్ల దుగరాజపట్నం కాకుంటే మరొకటి అడగాలి.
గత ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టు ప్రయోజనాల కోసం రామాయపట్నం పోర్టును ప్రతిపాదించలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గంగవరం, కృష్ణపట్నం పోర్టులను అదానీ పరం చేశారు. తాబేదారుకు రామాయపట్నం మినీ పోర్టును అప్పగించారు. ఇప్పుడు నిర్మించబోయే పోర్టులను ఎవరికి ధారాదత్తం చేస్తారో తెలీదు.
విశాఖ రాజధానిగా పరిపాలన ప్రారంభిస్తామని సీఎం ఎప్పుడో ప్రకటించారు. అయినా ఎలాంటి స్పందన లేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర యువత, పట్టభద్రులు, మేథావులు ప్రభుత్వానికి చెంపపెట్టుగా తీర్పునిచ్చారు. జగన్‌ను ఉత్తరాంధ్రులు నమ్మడం లేదనడానికి ఇదే ఉదాహరణ. విశాఖ రిషికొండ తవ్వకాలపై అనేక వివాదాలు నడుస్తున్నాయి. విశాఖ పరిసరాల్లో ఎంతో విలువైన భూములు అధికార పార్టీ అండదండలతో ఆక్రమణలకు గురైనట్లు ప్రజలు కోడై కూస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ భూములు, భవనాలను తనఖా పెట్టి అప్పులు తేవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించలేదు.
ఇవేమీ చేయకపోగా విశాఖ బీచ్లో డాక్టర్ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. అందుకే జగన్ అంటే నమ్మకం కాదు.. వంచన అంటున్నారు ఉత్తరాంధ్రులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates