టీడీపీ సీనియర్లు చంద్రబాబుకు శిరోభారమయ్యారు. కంట్లో నలుసుల్లా తయారై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఏడిపిస్తున్నారు. ఒకటికెట్ ఇవ్వడమే గగనమని చంద్రబాబు లెక్కలేసుకుంటుంటే.. ఇంటికి రెండు మూడు టికెట్లు అడుగుతూ వేధిస్తున్నారు. పైగా పార్టీని, అధినేతను బ్లాక్ మెయిల్ చేసేందుకు వెనుకాడటం లేదు.
కాళ్లు కదలక వీల్ ఛైర్లో తిరుగుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లా నేత రాయపాటి సాంబశివరావు కూడా ఇప్పుడు బ్లాక్ మేయిలర్ల జాబితాలో చేరారు. రెండు నెలల పాటు మౌనంగా ఉన్న రాయపాటి మళ్లీ మీడియా ముందుకు వచ్చి టికెట్ల పంచాయతీ మొదలు పెట్టారు. చంద్రబాబు చెబితే నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ఎవరో అడిగినట్లుగానే ఆయన ప్రకటించేశారు. పైగా గతంలో డబ్బులు లేక ఓడిపోయానని రాయపాటి చెప్పుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పార్టీ శ్రేణలు టెన్షన్ పడుతున్నాయి.
ఎంపీ సీటు ఇస్తారా లేక రెండు ఎమ్మెల్యే బీ- ఫార్మ్ లు ఇస్తారా అని అడుగుతూ ఆయన చంద్రబాబుకు పరోక్షంగా సందేశమిస్తున్నారు తన కుమారుడు రంగబాబుకు సత్తెనపల్లి లేదా పెదకూరపాడు టీడీపీ టికెట్ కావాలని రాయపాటి తెగేసి చెబుతున్నారు. తన తమ్ముడు కూతురు శైలజకు కూడా టికెట్ ఇవ్వాలంటున్నారు. పిల్లలిద్దరికీ టికెట్లు ఇస్తే తనకు ఇవ్వకపోయినా ఫర్వాలేదంటూ ఉదార స్వరాన్ని రాయపాటి వినిపిస్తున్నారు.
పైగా నరసరావుపేట లోక్ సభా స్థానాన్ని స్థానికులకే కేటాయించాలని రాయపాటి కొత్త మెలిక పెట్టారు. చాలా రోజులుగా అక్కడా ఇక్కడా చెబుతూ వచ్చిన రాయపాటి ఇప్పుడు నేరుగానే మీడియా ముందు కక్కేశారు. పేట టికెట్ ను టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ కు ఇవ్వాలని చంద్రబాబు ఎప్పుడో డిసైడయ్యారు. పుట్టా కుటుంబానికి కూడా సంకేతం అందడంతో , క్షేత్ర స్థాయిలో పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు రాయపాటి లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ తేవడంతో అది వైసీపీకి ప్రయోజనం కలిగిస్తుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరి రాయపాటి వ్యవహారాన్ని పార్టీకి అనుకూలంగా చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి..