ఎర్రగొండపాలెం చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళితులకు క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఎర్రగొండపాలెంలో పర్యటించాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ డిమాండ్ చేశారు. డిమాండ్ చేసినట్లుగానే చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అంతేకాదు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మంత్రి ఆఫీసుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో మంత్రి ఆదిమూలపు సురేశ్‌పై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్యే ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థిగా ఎరిక్షన్ బాబును ప్రకటించారు. దమ్ముంటే ఎరిక్షన్ బాబుపై పోటీ చేసి గెలవాలని మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు సవాల్ విసిరారు. మూలాలు లేని వ్యక్తి మంత్రి ఆదిమూలపు సురేశ్ అని చంద్రబాబు మండిపడ్డారు.
ఎరిక్షన్ బాబు ఇప్పటికే ఎర్రగొండ్లపాలెం టీడీపీ ఇంచార్జిగా పనిచేస్తున్నారు. కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలం, మొగుళ్లూరు గ్రామానికి చెందిన గూడూరి ఎరిక్షన్‌బాబు కొన్నాళ్లుగా నియోజకవర్గంలో యాక్టివ్‌గా జనంలో తిరుగుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వరుసగా ఓడిపోయిన బూదాల అజితారావు పార్టీకి దూరంగా ఉండడంతో ఆమె స్థానంలో ఎరిక్షన్‌బాబుకు అవకాశం దక్కింది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎరిక్షన్ బాబు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. కార్యకర్త స్థాయి నుంచి నియోజకవర్గ ఇంఛార్జి వరకూ ఎదిగారు. మొగుళ్లూరు సర్పంచ్‌గా ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. సొంత మండలం వెలిగండ్ల ఎంపీపీగా, జడ్పీటీసీగా పని చేశారు. బాబు హాయంలో లిడ్ క్యాప్ చైర్మన్‌గా పని చేశారు.
ఇప్పుడు ఎన్నికలు చాలాముందుగానే నేరుగా చంద్రబాబే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించడంతో టీడీపీ అవకాశాలు పెరుగుతాయని.. ఆదిమూలపు సురేశ్ మంత్రిగా ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ఆయనపై వ్యతిరేకత రెండు కలిసి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరిక్షన్ బాబు చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టే అవకాశాలున్నాయంటున్నారు.