ఏపీ బీజేపీ విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎవరితో కలవాలి ఎవరితో కలవకూడదో అర్థం కాక నానా తంటాలు పడుతోంది. జనసేన తమకు సహకరించడం లేదని గగ్గోలు పెట్టి ఇప్పుడు ఆ పార్టీతోనే కలిసిపోయేందుకు సిద్ధమవుతోంది. ఉమ్మడి ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతోంది.
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నేత మాధవ్ ఘోర పరాజయం తర్వాత జనసేనపై ఆయన ఆరోపణలు సంధించారు. తమతో పవన్ కల్యాణ్ కలిస రావడం లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాలని పవన్ ను కోరామని.. కానీ ఆయన స్పందించలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించమని చెప్పారు కానీ.. బీజేపీని గెలిపించాలని కోరలేదని ఆయన అన్నారు. జనసేనతో పొత్తు ఉన్నా.. లేనట్టే ఉన్నామని కామెంట్ చేశారు. రెండు పార్టీలు కలిసి పోరాటాలు చేయడం ద్వారా ప్రజల్లో తమపై నమ్మకం కలిగేలా చేయొచ్చని ఆయన అన్నారు. ఆ దిశగా చర్యలు లేకపోవడం వల్లే జనం తమను విశ్వసించడం లేదన్నారు.
ఇక పవన్ కల్యాణ్ కు ఎప్పుడో రోడ్ మ్యాప్ ఇచ్చామని ఇటీవలే తరుణ్ చుగ్ ప్రకటించారు.పది రోజుల క్రితం పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయినప్పుడు ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు. ఎందుకంటే ఇరు వర్గాలు ఏమీ వెల్లడించలేదు. శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర శాఖ కోర్ కమిటీ సమావేశంలో మాత్రం జనసేన పట్ల మాధవ్ సహా బీజేపీ నేతలు సానుకూల వైఖరినే ప్రదర్శించారు.
వైసీపీ ప్రభుత్వ తప్పిదాలపై ఛార్జ్ షీటు విడుదల చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. భూకబ్జాలు, అవినీతి, దౌర్జన్యాలను ఎండగట్టాలని డిసైడైంది. మే 5 నుంచి 15 వరకు పది రోజుల పాటు పోరాటం చేయాలని నిర్ణయించింది. జనసేన నేతలకు కూడా ఈ కార్యక్రమాలు వివరించి కలిసికట్టుగా వేళ్లేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారు.
జనసేన, బీజేపీ పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు వెళతామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే జనంలో కూడా తమపై నమ్మకం పెరగాలని బీజేపీ అంటోంది. మరి వారి ఉద్యమాలకు జనసేన సహకరిస్తుందో లేదో చూడాలి…