వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ.. తొలుత సాక్షిగాను.. తర్వాత నిందితుడిగాను సీబీఐ అధికారులు గుర్తించిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసుకునే విషయంలో అడ్డుకోవద్దని.. తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ రెడ్డి అరెస్టును ఈ నెల 25 వరకు నిలిపి ఉంచుతూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీకోర్టు స్టే విధించింది. అంతేకాదు.. సీబీఐ తన విచారణను స్వేచ్ఛగా నిర్వహించుకునే వాతావరణం కల్పించాలని సూచించింది.
ఈ మేరకు వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్ట్ స్టే విధించింది. ప్రతివా దులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దీంతో అవినాష్‌రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్ అయిందని సునీత తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు.
సునీత తరఫు లాయర్ ఏన్నారంటే.. దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టులో విచారణ సమయంలో చేపట్టా ల్సిన అంశాలను బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కేసులోని మెరిట్స్ ప్రకారం లేవన్నారు. హత్య వెనుక ఉన్న విస్తృత కుట్రకోణాన్ని బయటపెట్టాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిందని తెలిపారు. ఈ నెల 30 లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కూడా సుప్రీం ఆదేశించిందని, ఈ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థ సీబీఐపై ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా పనిచేసేలా చూడాలని కోరారు. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది.