కాంగ్రెస్ నేతల్లో మార్పురాదా ?

కాంగ్రెస్ నేతల్లో ఎప్పటికి మార్పురాదని అర్దమైపోయింది. పార్టీ ఎలాపోయినా పర్వాలేదు తమకు వ్యక్తిగత ప్రతిష్టే ముఖ్యమని నేతలు తేల్చి చెప్పేస్తున్నారు. తమ ప్రతిష్టను కాపాడుకోవటానికి అవసరమైతే పార్టీ పరువును బజారున పడేయటానికి కూడా ఏమాత్రం వెనకాడటంలేదు. ఈ విషయం తాజాగా మరోసారి బయటపడింది. కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఇందులో భాగంగా అనేక అంశాలపై రెగ్యులర్ గా ఆందోళనలు చేయాలని చెప్పింది.

ఇలాంటి ఆందోళనల్లో నిరుద్యోగ సభలు కూడా ఒకటి. మొదటి విడతలో ఐదు చోట్ల నిరుద్యోగసభలు నిర్వహించాలని నాయకత్వం ప్లాన్ చేసింది. ఈనెల 24వ తేదీన ఖమ్మం, 26న ఆదిలాబాద్, 28న నల్గొండ, 30వ తేదీన మహబూబ్ నగర్, మే 1వ తేదీన రంగారెడ్డి జిల్లాల్లో సభలు ఏర్పాటుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. సరిగ్గా ఈ సమయంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపోయారు. తనకు మాట మాత్రంగా చెప్పకుండానే నల్గొండలో నిరుద్యోగసభ ఏర్పాటుచేస్తారా అంటు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయారు.

తనకు తెలీకుండా నల్గొండలో సభ ఎలా పెడతారన్నట్లుగా మాట్లాడారు. దాంతో పార్టీలో గందరగోళమైపోయింది. నల్గొండలో నిరుద్యోగసభ జరుగుతుందా లేదా ? ఏర్పాట్లు చేయాలా వద్దా అనే అయోమయం మొదలైంది. దాంతో అధిష్టానం తరపున జాతీయ సెక్రటరీ నదీమ్ జావెద్ జోక్యం చేసుకున్నారు. చిన్న చిన్న విషయాలను సీరియస్ గా తీసుకోవద్దని ఉత్తమ్ కు నచ్చచెప్పారు.

కేసీయార్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో సీనియర్ నేతలంతా ఒకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. నల్గొండ సభ ఉత్తమ్ అధ్యక్షతనే జరుగుతుందని నదీమ్ హామీ ఇచ్చారు. దాంతో ఉత్తమ్ మెత్తబడి సభకు లైన్ క్లియర్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిరుద్యోగసభలు పెట్టాలన్నది నేతల సమిష్టి నిర్ణయం. ఒకవేళ రేవంత్ నిర్ణయమే అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా చేస్తున్నది. అందరి ఆలోచనా కేసీయార్ ను గద్దెదింపటమే అయినపుడు చిన్న విషయాలకు గోలచేయాల్సిన అవసరం ఏమిటి ? అన్నదే అర్ధంకావటంలేదు.